66వ జాతీయ అవార్డుల్లో `రంగ‌స్థ‌లం`?

66వ జాతీయ అవార్డుల్లో `రంగ‌స్థ‌లం`?
జాతీయ అవార్డు అందుకోవ‌డానికి అర్హ‌త ఏంటి? ప్ర‌తి ఏడాదీ ఇస్తున్న‌ అవార్డుల తీరుతెన్నులు ప‌రిశీలిస్తే, ఓ విష‌యం అర్థ‌మ‌వుతుంది. తెర‌పై ఉద్వేగాన్ని ర‌గిలించే నిండైన జీవితం క‌నిపించాలి. ఎమోష‌న్, స‌హ‌జ‌సిద్ధ‌త ఎంతో ముఖ్యం. ఒక ప్రాంతం భాష, సంస్కృతి సాంప్ర‌దాయాలు, ప్ర‌జ‌ల బ‌తుకు తెరువు, క‌థ‌-కంటెంట్‌కు త‌గ్గ‌ అత్యుత్త‌మ న‌ట ప్ర‌తిభ‌ .. ఇవ‌న్నీ అవార్డ్ క‌మిటీని ప్ర‌భావితం చేసే అంశాలే. అందుకే నేడు ప్ర‌క‌టించిన‌ 65వ జాతీయ అవార్డులలో అయిదు అవార్డులు సాధించింది అస్సామి చిత్రం `విలెజ్ రాక్ స్టార్స్`. ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ ఆడియోగ్రఫీ, ఉత్తమ పరిసరాల ఆడియోగ్రఫీ, ఉత్తమ బాల నటి అవార్డులు ఈ సినిమాకి ద‌క్కాయి. అంటే క‌మిటీ ఈ సినిమాలో ఏం ప‌రిశీలించిందో సూటిగానే అర్థ‌మైపోతోంది. కేవ‌లం జాతీయ అవార్డులే కాదు, ఈ సినిమా అంతర్జాతీయ సినిమా పుర‌స్కారాల్లో ఎన్నో అవార్డులను అందుకుంది. తెలుగు సినిమాల్లో `బాహుబ‌లి-2` వీఎఫ్ఎక్స్ విభాగం స‌హా ప‌లు విభాగాల్లో అవార్డులు అందుకుంది. అయితే వ‌చ్చే ఏడాది 66వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా నుంచి పుర‌స్కారాలు అందుకునే సినిమా ఏది? అంటే అన్ని వేళ్లు చ‌ర‌ణ్‌-సుకుమార్‌ `రంగ‌స్థ‌లం` వైపు చూపిస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు తిర‌గ‌రాయ‌డ‌మే కాదు, అవార్డ్ కంటెంట్ ఉన్న సినిమా అన్న టాక్ ఇప్ప‌టికే వినిపిస్తోంది. పైగా ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో ఘ‌న‌త‌వ‌హించిన అస్సామి చిత్రం `విలేజ్ రాక్‌స్టార్స్‌` విలేజ్ నేప‌థ్యం, స‌హ‌జసిద్ధ‌త‌కు ప‌ట్టం గట్టి తీసిన‌ది కాబ‌ట్టి, అదే కోణంలో ప‌రిశీలిస్తే `రంగ‌స్థ‌లం` నేప‌థ్యం ప‌ల్లె నేప‌థ్య‌మే. స‌హ‌జ‌సిద్ధ‌త‌తో స‌న్నివేశాల్ని మ‌లిచాడు సుకుమార్‌. 85ఏళ్ల‌ తెలుగు సినిమా హిస్ట‌రీలో గోదారి నేప‌థ్యంలో ఎన్నో సినిమాలు వ‌చ్చినా, రంగ‌స్థ‌లం ప్ర‌త్యేక‌త వేరుగా ఉంది. గోదారి ప‌ల్లెలు, సంస్కృతి, మ‌త్స్య‌కారులు-రైతుల నేపథ్యం పై తీసిన అరుదైన‌ సినిమా ఇది. గోదారి యాస‌, సంస్కృతి, ప్ర‌జెంట్ ప్ర‌జ‌ల యాటిట్యూడ్‌ని ప‌క్కాగా ఎలివేట్ చేసిన సినిమా కూడా ఇది. అక్క‌డి ప్ర‌జ‌ల జీవ‌న విధానాన్ని వంద‌శాతం ఎలివేట్ చేయ‌డంలో స‌క్సెస‌య్యాడు ద‌ర్శ‌కుడు. ఆయా పాత్ర‌ల్లో న‌టీన‌టులు జీవించారు. అందుకే రంగ‌స్థ‌లం వ‌చ్చే ఏడాది జాతీయ అవార్డుల ప‌రిశీల‌న‌కు వెళుతుంద‌న్న అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లు అద్దినా, ఈ సినిమాలోనూ స‌హ‌జ‌త్వం ఎంతో ఉంది. అందుకే వ‌చ్చే ఏడాది జాతీయ అవార్డుల‌కు పోటీ చేసే అర్హ‌త ఉన్న ప్రాంతీయ చిత్ర‌మిద‌ని మన సినీప్ర‌ముఖులు, విమ‌ర్శ‌కులు విశ్లేషిస్తున్నారు.