టీవీ9 సీఈవో పదవి నుంచి రవిప్రకాష్ తొలగింపు..

టీవీ9 సీఈవో పదవి నుంచి రవిప్రకాష్ తొలగింపు..

టీవీ9 సీఈవో పదవి నుంచి రవిప్రకాష్‌ను తొలగించింది యాజమాన్యం... సంతకం ఫోర్జరీ ఆరోపణలతో టీవీ9 యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీలో 91 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్‌ అడ్డుతగులుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, రవి ప్రకాష్‌తో పాటు హీరో శివాజీపై అలందా మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు... ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, ఐటీ యాక్ట్ 66, 72  కింద కేసు నమోదు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. టీవీ9ను కొనుగోలు చేసిన అలందా మీడియాకు అప్పగించినట్లు ఒప్పందం జరిగినా డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు. టీవీ9లో 91 శాతానికి పైగా అలందా మీడియాకు వాటా ఉండగా.. రవిప్రకాష్‌కు 8.5 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఒప్పందం సమయంలో ఇచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీ పత్రాలని గుర్తించిన అలందా మీడియా... పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తనకు 40 వేల షేర్లు టీవీ9లో ఉన్నాయని, తనకు తెలియకుండా అలందాకు విక్రయించారని శివాజీ ఆరోపించారు. అయితే, రవి ప్రకాష్, శివాజీ ఇద్దరు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మమ్మల్ని మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అలందా డైరెక్టర్ కౌశిక్ రావు. ఇక టీవీ9 ఆఫీసు, సీఈవోగా  పనిచేసిన రవి ప్రకాష్‌ నివాసంతో పాటు... హీరో శివాజీ నివాసంలోనూ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. ఫోర్జరీ డాక్యుమెంట్లను కూడా పోలీసులు తన సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉదయం 6 గంటల నుంచి నాలుగు ప్రత్యేక బృందాలు సోదాలు కొనసాగిస్తున్నాయి. ఓవైపు పోలీసుల సోదాలు కొనసాగుతోన్న సమయంలోనే టీవీ9 యాజమాన్యం.. రవిప్రకాష్‌ను సీఈవో పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.