ధోనీ బంతి ఎందుకు తీసుకున్నాడంటే...

ధోనీ బంతి ఎందుకు తీసుకున్నాడంటే...

సుదీర్ఘ ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోని పరుగులు చేసినా.. మునిపటిలా ఆడలేకపోతున్నాడని విమ‌ర్శ‌లు వస్తున్నాయి. మూడో వన్డే  ఓటమి అనంతరం ధోనిని ఇంకా ఎందుకు ఆడిస్తున్నారంటూ అభిమానులు కెప్టెన్‌, సెలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డే అనంత‌రం ధోని అంపైర్ నుంచి బాల్ తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని గుడ్‌బై చెపుతున్నాడా? అని అభిమానుల్లో సందేహాలు  నెలకొన్నాయి. అయితే దీనిపై తాజాగా భారత జట్టు కోచ్‌ ర‌విశాస్త్రి స్పందించారు.

రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ... ధోనీ రిటైర్మెంట్‌ ఇప్పుడే ప్రకటించడం లేదు. ధోనీ రిటైర్మెంట్‌ గురించి వస్తున్న వార్తలు అవాస్తవం. లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో చివరి వన్డే అనంతరం ధోనీ ఫీల్డ్‌ అంపైర్ అనుమతితోనే బంతిని తీసుకున్నాడు. అయితే ఆ బంతిని భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు చూపించేందుకు మాత్రమే తీసుకున్నాడు. కోచ్  కు ఆ బంతిని చూపించి మ్యాచ్‌లో పడిన ఇబ్బందులు గురించి వివరించడానికి అలా చేసాడు. ఇదే పిచ్‌లపై వచ్చే ఏడాది ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఓ అవగాహన కోసం. అంతేకాదు ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్‌ కూడా జరగనుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడి పరిస్థితులపై బౌలింగ్‌ కోచ్‌ భరత్‌తో చర్చించడానికే ధోని బంతిని తీసుకున్నాడని రవిశాస్త్రి స్పష్టం చేసాడు.