మూవీ రివ్యూ : 'నేల టిక్కెట్టు'

మూవీ రివ్యూ : 'నేల టిక్కెట్టు'

నటీనటులు : రవితేజ, మాళవిక శర్మ, జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసానికృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్  తదితరులు  

ఛాయాగ్రహణం : ముఖేష్

సంగీతం : శక్తికాంత్ కార్తీక్  

దర్శకత్వం : కళ్యాణ్‌కృష్ణ కురసాల 

నిర్మాణ సంస్థ : ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ 

నిర్మాత :  రామ్ తాళ్లూరి, రజనీ తాళ్లూరి 

విడుదల తేదీ : 25 మే 2018

'నేల టిక్కెట్టు' పాటలు, ప్రచార చిత్రాలు ఏమంత బాగోలేదు. రవితేజ గత చిత్రాల తరహాలో రొటీన్ మాస్ మసాలా చిత్రమనే అభిప్రాయాన్ని కలిగించాయి. దీనికి తోడు ఈ జనవరిలో విడుదలైన రవితేజ 'టచ్ చేసి చూడు' ప్లాప్ కావడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు కలగలేదు. అయితే... దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ తీసిన రెండు చిత్రాలు 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' రొటీన్ అయినప్పటికీ... ప్రేక్షకులను అలరించడంతో సినిమాలో ఏదో విషయం వుంటుందని ఆశించారు. ప్రతికూల, అనుకూల పరిస్థితుల మధ్య ఈ రోజు విడుదలైన సినిమా ఎలా వుంది? రివ్యూ చదివి తెలుసుకోండి! 

కథ : సినిమాలో హీరో పేరే 'నేల టిక్కెట్టు'. విశాఖలో అతడు అనాథ. ప్రతి మనిషిలో ఓ బంధాన్ని, బంధుత్వాన్ని చూసుకుంటూ... అందరినీ ఏదో ఒక వరుసలతో పిలుస్తాడు. బంధుత్వంతో పిలిస్తే ఎంత రిస్క్ తీసుకుని అయినా ఎదుటివ్యక్తి సహాయం చేసేస్తాడు. ఆ క్రమంలో విశాఖ సిటీ పోలీస్  కమీషనర్‌తో అతడికి చిన్న తిరకాసు ఏర్పడడంతో నెల రోజులు హైదరాబాద్‌లో వుంటే సమస్య పరిష్కారం అవుతుందని మకాం మారుస్తాడు. హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే హీరోయిన్ మాళవిక శర్మని చూసి ప్రేమలో పడతాడు. తరవాత హోమ్ మినిస్టర్ ఆదిత్య భూపతి (జగపతి బాబు) మనుషులతో వరుసగా గొడవలు పెట్టుకుంటాడు. డబ్బు సంపాదనే ధ్యేయంగా అధికార దాహంతో అడుగులు వేస్తున్న హోమ్ మినిస్టర్‌కి అడుగడుగునా అడ్డు తగులుతాడు. హీరో ఎందుకలా చేస్తుంటాడు? అసలు హీరోకి, హోమ్ మినిస్టర్‌కి సంబంధం ఏంటి? మధ్యలో హీరోయిన్ పాత్ర ఏంటి? 'చుట్టూ జనం... మధ్యలో మనం. అలా వుండాలి  లైఫ్ అంటే' అని చెప్పే జనం కోసం హీరో ఏం చేశాడు? అనేది చిత్రకథ. 

నటీనటుల పనితీరు : 

రవితేజ ఎప్పటిలా చేశాడు. నటనలో కొత్తదనం లేదు. మునుపటి కంటే లుక్స్ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం వచ్చిందనే సంగతి ప్రతి సన్నివేశంలో అర్థమవుతుంటుంది. మాళవిక శర్మ నటన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆమెకు నటించేంత స్కోప్ కూడా రాలేదు. పాటల్లో అందాల ప్రదర్శన మాత్రం మస్తుగా చేసింది. జగపతిబాబుది రొటీన్ విలన్ పాత్రే. సో.. అందుకు తగ్గట్టుగా ఆయన చేసుకుంటూ వెళ్లాడు. ఎప్పుడూ హీరో చుట్టూ అలీ, ప్రవీణ్.. విలన్ జగపతిబాబు చుట్టూ పోసాని, రఘుబాబు వుంటారు. కానీ, ఒక్కరి నటన కూడా ఆకట్టుకోదు. ఏదో సన్నివేశంలో వున్నారంటే వున్నారని అన్నట్టు వాళ్ల పాత్రలు వుంటాయి. సినిమాలో బ్రహ్మానందం వున్నారు. కానీ, ఆయనకు రెండంటే రెండు డైలాగులు మాత్రమే దక్కాయంటే  పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. సంపత్, బ్రహ్మాజీ, సుబ్బరాజ్, కౌముది... ఎలా చెప్పుకుంటూ పోతే సినిమాలో చాలామంది ఆర్టిస్టులు వున్నారు. కానీ, ఎవరికీ సరైన పాత్ర దక్కలేదు.   

సంగీతం - సాంకేతిక వర్గం : 

'ఫిదా'కి పాటలు అందించిన సంగీత దర్శకుడు ఈ 'నేల టిక్కెట్టు'కి పాటలు అందించాడంటే నమ్మడం కష్టం. పాటలు అంత పేలవంగా వున్నాయి. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ సినిమాకి చాలా కత్తెరలు వేయాలి. నిర్మాణ విలువలు కొంతలో కొంత మేలు. సినిమాలో ఆర్టిస్టులు, లొకేషన్స్ చూస్తుంటే నిర్మాతలు ఎంత ఖర్చుపెట్టారో తెలుస్తుంది. ఫైట్స్, ఆర్ట్ వర్క్, లిరిక్స్ తదితర విషయాలు ఏవీ గుర్తు పెట్టుకొనేట్టు లేవు.  

దర్శకత్వం : 

సినిమా ప్రారంభమైన పావుగంట నుంచి 'సోగ్గాడే చిన్ని నాయనా', 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలు తీసింది ఈ దర్శకుడేనా? అని ప్రేక్షకులు సందేహం వస్తే అది వాళ్ల తప్పు కాదు. ముమ్మాటికీ దర్శకుడి తప్పే. ఒక్కటంటే ఒక్క సన్నివేశాన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయలేకపోయాడు. తెరనిండుగా ఆర్టిస్టులు కనపడతారు. కానీ, ఎవరూ ఏమీ చేసినట్టు వుండదు. ఒక్క సన్నివేశంలోనూ డెప్త్ లేదు. అట్ట్రాక్ట్ చేసే ఎలిమెంట్ లేదు. 'ముసలితనం అంటే చేతకానితనం కాదురా... నిలువెత్తు అనుభవం' అని చెప్పే సన్నివేశం తెరపై వస్తున్నా ప్రేక్షకుడిలో చలనం వుండదు. అంత పేలవంగా దర్శకత్వం వుంది.

విశ్లేషణ :

ఓ అనాథ అధికార దాహంతో, డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా పెరిగి పెద్దయితే ఎలా వుంటాడు? మరో అనాథ అందర్నీ ఆప్తులు అనుకుని పెరిగి పెద్దయితే ఎలా వుంటాడు? అనేది క్లుప్తంగా చిత్రకథ. అందులో ఓ అనాథ హోమ్ మినిస్టర్ కమ్ విలన్ జగపతిబాబు అయితే... మరో అనాథ హీరో. ఇద్దరి మధ్య పోరాటమే సినిమా. దీన్ని దర్శకుడు ముందునుంచి నేరుగా చెప్పకుండా మలుపులు తిప్పుతూ ఒక్కో ట్విస్ట్ విడుదల చేస్తూ రెండున్నర గంటలకు పైగా సాగదీశాడు. అతడు ట్విస్ట్ అనుకున్న ప్రతిదీ ప్రేక్షకులను టార్చర్ పెట్టింది. సినిమా ఓపెనింగ్ టు ఎండ్ ఒక్క సన్నివేశం, ఒక్క పాట కూడా ఆకట్టుకోదు. అసలు పాటలకు సరైన సందర్భమే లేదు.  ఇంటర్వెల్‌కి సినిమా కథ మీద ప్రేక్షకుడికి ఒక అవగాహన వచ్చేస్తుంది. అటువంటి సమయంలో సెకండాఫ్ పరుగులు పెట్టాలి. ఇక్కడ పరుగులు పెట్టకపోగా... దర్శకుడు ఇస్తున్న ట్విస్టులకు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవుతుందంటే నమ్మండి. చాలా సినిమాల్లో సన్నివేశాలు ఎంత సప్పగా వున్నా... తన నటనతో ఎంతో కొంత వినోదాన్ని అందించే రవితేజ కూడా ఈసారి చేతులు ఎత్తేశాడు. దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పలేక సతమతం కావడంతో సినిమాలో గందరగోళం ఏర్పడింది. థియేటర్లోని ప్రేక్షకుల్లో నిస్తేజం ఆవహిస్తుంది.