ఇక నో టెన్షన్..! డెబిట్‌, క్రెడిట్‌ కార్డులకు కొత్త ఆప్షన్‌..!

ఇక నో టెన్షన్..! డెబిట్‌, క్రెడిట్‌ కార్డులకు కొత్త ఆప్షన్‌..!

ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి... ప్రజల ఖాతాల్లోని సొమ్ము ఖాళీ చేస్తూనే ఉన్నారు.. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల నుంచి కూడా డబ్బులు లాగేస్తూ.. ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు... అయితే, వీటికి చెక్‌పెట్టాలన్న ఉద్దేశంతో కార్డు జారీ చేసే బ్యాంక్‌ లేదా సంస్థలు వినియోగదారుడికి కార్డ్‌ నాట్‌ ప్రజెంట్‌ లావాదేవీలు, కార్డు ప్రజెంట్‌ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలు వంటి ఆప్షన్లను యాక్టివేట్‌ లేదా డీయాక్టివేట్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సర్క్యులర్ జారీ చేసింది. వినియోగదారులకు కొత్త ఆప్షన్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది.

ఇక, ఆర్బీఐ పేర్కొన్న విషయాలు పరిశీలిస్తే.. కార్డ్‌ నాట్‌ ప్రజెంట్‌ ఆప్షన్‌ ఆన్‌లైన్‌ లావాదేవీలకు సంబంధించినది. లావాదేవీల స్విచ్‌ ఆన్‌, స్విచాఫ్‌ వెసులుబాటుతోపాటు లావాదేవీ పరిమితి నిర్దేశించడం, సవరించుకోవడానికి అవకాశం కల్పించాలి. అయితే, ఈ ఆప్షన్‌ ఎంచుకునే వారికి అన్ని రకాల అంటే దేశీయ, అంతర్జాతీయ, పీఓఎస్‌, ఏటీఎం, ఆన్‌లైన్‌, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలను మొబైల్‌ యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం, ఐవీఆర్‌ 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇక, ఇప్పటికే జారీ అయిన కార్డుల విషయంలో కస్టమర్ రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కార్డ్‌ నాట్‌ ప్రజెంట్‌, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలకు ఇప్పటి వరకు ఉపయోగించని కార్డును ఈ ఆప్షన్లను తప్పనిసరిగా డీయాక్టివేట్‌ చేయాలని ఆదేశించింది ఆర్బీఐ. అయితే, ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ కార్డ్‌లు, మాస్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌లో ఉపయోగించే సాధనాలకు మాత్రం తప్పనిసరి కాదని స్పష్టం చేసింది ఆర్బీఐ. తాజాగా ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం, కార్డుల ద్వారా చేసిన లావాదేవీల పరిమాణం మరియు విలువ సంవత్సరాలుగా చాలా రెట్లు పెరిగాయి. వినియోగదారు సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి మరియు కార్డ్ లావాదేవీల భద్రతను పెంచడానికి ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్‌బీఐ ఆదేశం ప్రకారం, కార్డు హోల్డర్‌కు వారి కార్డులపై ఇతర సదుపాయాలు జారీ అయిన తర్వాత వాటిని ఆన్ మరియు ఆఫ్ చేసే సౌకర్యం ఇవ్వాలి. కార్డ్ లావాదేవీల భద్రతను పెంచే ఈ ఆదేశాలు ఆర్బీఐ నోటిఫికేషన్ ప్రకారం 2020 మార్చి 16 నుండి అమల్లోకి రానున్నాయి.