నేడు రిజర్వ్‌బ్యాంక్ బోర్డు కీలక సమావేశం

నేడు రిజర్వ్‌బ్యాంక్ బోర్డు కీలక సమావేశం

కేంద్ర ప్రభుత్వంతో పలు అంశాలపై విభేదాలు నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ బోర్డు కీలక సమావేశం ఇవాళ జరగనుంది. భేటీ కొంత వాడివేడిగా జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్బీఐ రిజర్వుల నుంచి రూ.3.6 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం, సూక్ష్మ, మధ్య, చిన్న తరహా కంపెనీలకు మరింత తేలిగ్గా రుణాలు అందేలా నిబంధనలు సవరించడం వంటి అంశాలపై కేంద్రం, ఆర్‌బీఐ మధ్య అగ్గి రాజుకున్న సమయంలో ఈ భేటీ జరుగుతుండడంతో పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆర్‌బీఐకి చెందిన నలుగురు డిప్యూటీ గవర్నర్లు, ప్రభుత్వం నియమించిన 13 మంది నామినీ డైరెక్టర్లు పాల్గొంటారు. ఈ సమావేశంలో  తీసుకునే నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంత మంది స్వతంత్ర డైరెక్టర్లతో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు నామినీ డైరెక్టర్లు ఈ సమావేశంలో ఉర్జిత్‌ పటేల్‌ను కొన్ని అంశాలపై గట్టిగా నిలదీసే అవకాశం ఉంది.