ఆవగింజంత బంగారమైనా దేశం బయటికి పంపలేదు

ఆవగింజంత బంగారమైనా దేశం బయటికి పంపలేదు

2014 లేదా ఆ తర్వాత దేశం నుంచి ఆవగింజంత బంగారాన్నయినా బయటికి పంపలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ప్రకటించింది. కొన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో కేంద్ర బ్యాంక్ 2014లో కొంత బంగారాన్ని విదేశాలకు పంపినట్టు కథనాలు వెల్లువెత్తడంతో ఆర్బీఐ ఈ ప్రకటన జారీ చేసింది. 

ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారాన్ని సురక్షితంగా ఉంచేందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సహా ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల్లో ఉంచడం సర్వసామాన్యంగా జరిగే విషయమేనని ఆర్బీఐ చెప్పింది. 2014 లేదా ఆ తర్వాత దేశం నుంచి ఆవగింజంత బంగారాన్ని కూడా ఇతర దేశాలకు తరలించలేదని తన ప్రకటనలో కేంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది. దీనిపై మీడియాలో వచ్చిన కథనాలన్నీ అభూత కల్పనలు, పూర్తిగా తప్పని చెప్పింది.

కాంగ్రెస్ పార్టీ ఇటీవల ట్విట్టర్ లో ఒక కథనాన్ని ట్వీట్ చేసింది. అందులో 2014లో ఆర్బీఐ 200 టన్నుల బంగారాన్ని స్విట్జర్లాండ్ పంపినట్టు తెలిపింది. పార్టీ ఆ రిపోర్ట్ ట్యాగ్ చేస్తూ మోడీ సర్కార్ గప్ చుప్ గా ఆర్బీఐ 200 టన్నుల బంగారాన్ని 2014లో స్విట్జర్లాండ్ పంపిందని చెప్పింది.

ఓవర్సీస్ చైనా బ్యాంకింగ్ కార్ప్ కి చెందిన ఆర్థికవేత్త హోవేయీ లీ ప్రకారం ఆర్బీఐ 2019లో 15 లక్షల ఔన్సుల బంగారాన్ని కొనుగోలు చేయగలదు. ఐఎంఎఫ్ ప్రకారం 2018లో ఆర్బీఐ మొత్తం 42 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. జనవరి, ఫిబ్రవరిలలో బంగారాన్ని మరింత కొన్న తర్వాత దేశ బంగారం నిల్వలు రికార్డ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర దాదాపు 609 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. 2018లో రష్యా అత్యధికంగా 274 టన్నుల బంగారం కొనుగోలు చేసింది.