పెద్ద నోట్ల రద్దుకు అభ్యంతరం తెలిపిన ఆర్బీఐ!!!

పెద్ద నోట్ల రద్దుకు అభ్యంతరం తెలిపిన ఆర్బీఐ!!!

నవంబర్ 8, 2016 రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన పెద్ద నోట్ల రద్దుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బోర్డ్ అభ్యంతరం తెలిపింది. నాలుగు అంశాలపై ఆర్బీఐ బోర్డ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే 'విశాల ప్రజా ప్రయోజనాన్ని' దృష్టిలో ఉంచుకొని అంగీకారం తెలిపినట్టు ఒక ఆర్టీఐకి ఇచ్చిన జవాబు ద్వారా వెల్లడైంది.

టీవీ ద్వారా ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడానికి రెండున్నర గంటల ముందు కేంద్ర బ్యాంక్ బోర్డు సమావేశమైంది. బోర్డు తన ఆమోదం తెలుపకుండానే రూ.500, రూ.1000 నోట్లను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో చలామణిలో ఉన్న నగదులో 80% తుడిచి పెట్టుకుపోయింది. 

ఇది జరిగిన కొన్ని వారాలకు డిసెంబర్ 16న ఆమోదాన్ని ప్రభుత్వానికి పంపడం జరిగింది. నిషేధానికి అనుకూలంగా ప్రభుత్వం చేసిన చాలా వాదనలను ఆర్బీఐ తిరస్కరించింది. 

ఆర్టీఐ ప్రశ్నకి జవాబుగా విడుదల చేసిన ఆర్బీఐ సమావేశం మినిట్స్ ప్రకారం, డైరెక్టర్లు దీనిని 'మెచ్చుకోదగిన చర్య' అని చెప్పినప్పటికీ దీని ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీపై స్వల్పకాల ప్రతికూల ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.

ఆర్థిక వ్యవస్థ ప్రస్తావిత వృద్ధి రేటు వాస్తవ వృద్ధి రేటు అని చలామణిలోని కరెన్సీ పెరుగుదల నామమాత్రమేనని బోర్డు చెప్పింది. 'ద్రవ్యోల్బణానికి సవరిస్తే, తేడా పెద్దగా ఉండకపోవచ్చు. అందువల్ల ఈ వాదనకు సిఫార్సు చేసేంత మద్దతు లేదని' డైరెక్టర్లు చెప్పారు.

నకిలీ నోట్లు కూడా ఆందోళన కలిగించే అంశం అని కేంద్ర బ్యాంక్ డైరెక్టర్లు భావించారు. 'దేశంలో మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీ ప్రమాణంతో పోలిస్తే రూ.400 కోట్లు అనేది ఒక శాతంగా చూస్తే పెద్దదేం కాదని' అన్నారు.

నల్లధనంలో చాలా వరకు నగదు రూపంలో కాకుండా బంగారం, రియల్ ఎస్టేట్ వంటి ఆస్తుల రూపేణా ఉందని.. పెద్ద నోట్ల రద్దుతో ఆ వస్తురూప ఆస్తులపై పెద్దగా ప్రభావం ఉండదని బోర్డు భావించింది.

ఈ వ్యవహారంపై కేంద్రం, ఆర్బీఐల మధ్య ఆర్నెల్లకు పైగా చర్చలు జరుగుతున్నాయని బోర్డుకు తెలిపారు.