ముదురు నీలం రంగులో కొత్త రూ.100 నోటు

ముదురు నీలం రంగులో కొత్త రూ.100 నోటు

గులాబీ రూ.2000 నోటు, పసుపు రూ.200 నోటు, ఆకుపచ్చ రూ.50 నోటు.. రంగురంగుల్లో కరెన్సీ నోట్లను ముద్రిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు కొత్తగా ముదురు నీలం రంగులో రూ.100 నోటు తెస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో ఈ నోట్లను విడుదల చేయబోతున్నట్టు ప్రముఖ వార్తాసంస్థల కథనాల ప్రకారం తెలుస్తోంది. ఇది కొత్త రూ.10 నోటు కంటే కొంచెం పెద్దదిగా ప్రస్తుతం ఉన్న రూ.100 నోటుతో పోలిస్తే చిన్నదిగా ఉండనున్నట్టు సమాచారం.

తుది ఆమోదముద్ర పొందిన కొత్త రూ.100 నోట్లను రూ.2000 నోట్లు ముద్రించిన దేవాస్ లోని ప్రింటింగ్ ప్రెస్ లోనే ముద్రిస్తున్నారని తెలుస్తోంది. కొత్త నోట్ల ముద్రణకు విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న సిరాను వాడుతున్నారు. కొత్త రూ.100 నోటుపై ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన గుజరాత్ లోని చారిత్రక మెట్ల బావి రానీ కీ వావ్ ముద్రించనున్నట్టు తెలిసింది.

కొత్త నోట్లు విడుదల చేసినప్పటికీ పాత రూ.100 నోట్ల చలామణిలో ఎలాంటి మార్పులు ఉండబోవు. అయితే నోటు పరిమాణంలో మార్పులు చేస్తున్నందువల్ల దేశవ్యాప్తంగా బ్యాంకులు మరోసారి తమ ఏటీఎం ట్రేలను మార్చుకోవాల్సి ఉంటుంది.