వడ్డీ రేట్ల పెంపు ఖాయమా?

వడ్డీ రేట్ల పెంపు ఖాయమా?

భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బీఐ) హ్యాట్రిక్‌ షాక్‌ ఇవ్వనుందా? ఇప్పటికే రెండుసార్లు వడ్డీ రేట్లు పెంచిన ఆర్‌బీఐ ఇవాళ కూడా అదే దారిలో పయనిస్తుందా? మొన్నటి నుంచి జరుగుతున్న ఆర్బీఐ క్రెడిట్‌ పాలసీ కమిటీ ఇవాళ తన తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది. మెజారిటీ బ్యాంకర్లు వడ్డీ రేటును మరో పావు శాతం పెంచుతారని అంటున్నారు. ఇప్పటికే రెపో రేటు 6.5 శాతానికి చేరింది. రూపాయి బలహీనంతో దిగుమతులు భారం కావడం, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగినందున... వచ్చే కొద్దినెలల్లో కచ్చితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచుతుందని బ్యాంకింగ్‌ రంగం భావిస్తోంది. అయితే స్టాక్‌ మార్కెట్‌ ఇప్పటికే భారీగా పతనం కావడం, కీలక రంగాల వృద్ధిరేటు దారుణంగా క్షీణించిన నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచడంతో పాటు బ్యాంకుల వద్ద మరిన్ని నిధులు అందుబాటులోకి వచ్చేలా ఆర్బీఐ చర్యలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. అంటే మార్కెట్‌లో నిధులు సమృద్ధిగా ఉండే పక్షంలో వడ్డీ రేట్లను బ్యాంకులు భారీగా పెంచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే ఒకవైపు రెపో రేటు పెంచుతూనే... జనంపై ఆ భారం పడకుండా చూసేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకోవచ్చు.
స్టాక్‌ మార్కెట్‌ ప్రభావం
వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచుతారని స్టాక్‌ మార్కెట్‌ అంచనా. ఈ మాత్రం పెరుగుదలను మార్కెట్‌ ఇప్పటికే డిస్కౌంట్‌ చేసింది. ఇదే స్థాయిలో పెంచినా లేదా మరికొన్ని సానుకూల నిర్ణయాలు తీసుకునేపక్షంలో మార్కెట్‌ కూడా పాజిటివ్‌గా స్పందించవచ్చు.