కమర్షియల్ బ్యాంకుల మూత..!? ఆర్బీఐ ఏమంటోంది..?

కమర్షియల్ బ్యాంకుల మూత..!? ఆర్బీఐ ఏమంటోంది..?

ఇటీవల పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌ వ్యాపార లావాదేవీలను నిలిపివేస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆరు నెలల వరకూ అప్పులు ఇవ్వకూడదని ఆదేశించింది. మరోవైపు పీఎంసీ బ్యాంక్‌ డిపాజిట్‌దారుల్ని కూడా కష్టాల్లోకి నెట్టింది ఆర్బీఐ. వెయ్యి రూపాయలు మించి విత్‌డ్రా చేయడానికి విల్లేదన్న ఆదేశాలతో అయోమయంలో పడ్డారు కస్టమర్లు. తమ డబ్బులు డ్రా చేసుకోడానికి పీఎంసీ బ్యాంక్‌ బ్రాంచీలకు పోటెత్తుతున్నారు. ఇక ఇదే సమయంలో ఫలానా బ్యాంక్‌ను మూసేస్తారు... పంజాబ్‌-మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌కు పట్టిన గతే ఈ బ్యాంక్‌కు పడుతుంది... దేశంలో పలు బ్యాంకుల్ని మూసివేయబోతున్నరే పుకార్లకు ఊతమిచ్చింది. కొన్ని కమర్షియల్‌ బ్యాంకులు మూతపడబోతున్నాయంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జోరందుకుంది. 

దేశంలోనే అతి పెద్ద కమర్షియల్‌ బ్యాంకులు ఈ జాబితాలో ఉండడంతో వినియోగదారుల్లో ఆందోళన ఎక్కువైంది. దేశంలోని బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని గ్రహించిన ఆర్బీఐ అధికారులు... సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. కొన్ని కమర్షియల్‌ బ్యాంకులు మూతపడతాయన్న ప్రచారంలో నిజం లేదని... సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం అసత్యమని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది. పీఎంసీ బ్యాంకుకు తక్షణమే వచ్చిన ముప్పేమీ లేదని తెలిపింది. అయితే, వ్యాపార లావాదేవీలు జరపొద్దని పీఎంసీ బ్యాంక్‌ను ఎందుకు ఆదేశించిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఆర్బీఐ.