నోట్ల ప్రింటింగ్‌కు పేపర్, ఇంకు లేదు?

నోట్ల ప్రింటింగ్‌కు పేపర్, ఇంకు లేదు?
రిజర్వు బ్యాంక్‌ అనాలోచిత చర్య కారణంగా కొత్త నోట్ల ప్రింటింగ్‌కు పేపర్, ఇంకు కొరతగా ఉన్నట్లు తెలుస్తోంది. నోట్ల ప్రింటింగ్‌కు అవసరమైన పేపర్ కోసం ఇచ్చిన ఓ విదేశీ ఆర్డర్‌ను గత ఏడాది ఆర్‌బీఐ రద్దు చేసిందని విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ ద ఎకనామిక్‌ టైమ్స్ పత్రిక రాసింది. నోట్ల ప్రింటింగ్‌ కోసం దేశీయంగా 12 వేల టన్నుల పేపర్‌ను సమకూర్చుకుంటున్న ఆర్‌బీఐ... దాదాపు 30 వేల టన్నుల పేపర్‌ను దిగుమతి చేసుకుంటుందని ఆ పత్రిక పేర్కొంది. నోట్ల రద్దు తరవాత కొత్త నోట్లను భారీ ఎత‌్తున ప్రింట్‌ చేశారు. అయితే కొత్త నోట్ల ఇండెంట్‌ ను ఆర్‌బీఐ తగ్గించడంతో... కాగితం కోసం ఇదివరకే ఇచ్చిన టెండర్‌ను ప్రెస్‌లు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే దేశ వ్యాప్తంగా నోట్ల కొరత తీవ్రంగా ఉందని మీడియాలో వార్తలు రావడంతో వెంటనే ఆర్‌బీఐ స్పందించింది. కొత్త నోట్ల ముద్రణ పెంచినట్లు పేర్కొంది. కాని కాగితం సరఫరాను ఆర్‌బీఐ తగ్గించినమాట వాస్తవమేనని పేపర్‌ సరఫరాదారులను పేర్కొంటున్నారని ఎకనామిక్‌ టైమ్స్ తెలిపింది. ఎన్నికల సమయంలో నోట్లకు డిమాండ్‌ పెరుగుతుందని తెలిసీ... ఆర్‌బీఐ ఇలా చేయడం వెనుక అంతరార్థం ఎవరికీ అంతుబట్టడం లేదని ఆ పత్రిక పేర్కొంది.