అప్పుడు పెట్రోల్ బంకులకి ఎన్ని పెద్దనోట్లు వచ్చాయో తెలియదు

అప్పుడు పెట్రోల్ బంకులకి ఎన్ని పెద్దనోట్లు వచ్చాయో తెలియదు

పెద్దనోట్ల రద్దుతో కనుమరుగైన రూ.500, రూ.1000 నోట్లతో పెట్రోల్ పంపుల దగ్గర ఎన్ని చెల్లింపులు జరిగాయనే దానికి సంబంధించిన గణాంకాలు తమ దగ్గర లేదని భారతీయ రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఓ ఆర్టీఐ అర్జీకి జవాబుగా ఆర్బీఐ ఈ సమాధానం ఇచ్చింది. ఇంధనం పోయించుకొనేటపుడు పాత నోట్లతో ఎన్ని చెల్లింపులు జరిగాయో తన దగ్గర రికార్డు లేదని ఆర్బీఐ తెలిపింది.

గత ఏడాది ఆగస్టులో 99.3% పాత నోట్లు బ్యాంకుల్లోకి తిరిగి వచ్చాయని ఆర్బీఐ ప్రకటించింది. పెద్దనోట్లు రద్దు చేయాలని ప్రభుత్వం హఠాత్తుగా నిర్ణయించినపుడు 15.41 లక్షల కోట్ల రూ.500, రూ.1000 పాత నోట్లు చలామణిలో ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. పెద్దనోట్ల రద్దు తర్వాత 15.31 లక్షల కోట్లు బ్యాంకుల్లోకి తిరిగి వచ్చాయి. పెద్దనోట్ల రద్దుతో నల్లధనానికి కళ్లెం పడిందని, అవినీతికి అడ్డుకట్ట పడిందని ప్రభుత్వం చెప్పింది. 

నవంబర్ 8,2016న పెద్దనోట్లని రద్దు చేశాక కేంద్ర ప్రభుత్వం 25 నవంబర్ 2016 వరకు రద్దయిన రూ.500, రూ.1000 పాత నోట్లను 23 సేవలకు వినియోగించడాన్ని అనుమతించింది. వీటిలో ఆస్పత్రులు, డెయిరీ, రైల్వే టికెట్లు, ప్రజా రవాణా, విమాన టికెట్లు, పెట్రోల్ పంపులు, మెట్రో రైల్ టికెట్లు, మెడికల్ స్టోర్లు, విద్యుత్, నీళ్ల బిల్లులు సహా 23 సేవలలో పాత నోట్లు స్వీకరించేందుకు ఆమోదం తెలిపింది.

నల్లధనాన్ని నియంత్రించేందుకు చారిత్రక నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం 8 నవంబర్ 2016న రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు కావని తెలిపింది. వీటిని కొత్త నోట్లతో మార్చుకొనేందుకు ప్రభుత్వం కొంత గడువు ఇచ్చింది.