ఎప్పుడైనా డబ్బు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్, ఆర్బీఐ కొత్త నియమం

ఎప్పుడైనా డబ్బు ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్, ఆర్బీఐ కొత్త నియమం

ఆన్ లైన్ ఫండ్ ట్రాన్స్ ఫర్ చేయాలంటే ఈ సౌకర్యం నిర్ధారిత సమయానికే ఎందుకు పరిమితమైందని చింతిస్తున్నారా? ఇక మీరు డబ్బుని ట్రాన్స్ ఫర్ చేయడం ఎంతో సులువు కానుంది. వారంలో ఏడు రోజులు, 24 గంటల్లో ఎప్పుడైనా డబ్బు బదిలీ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎప్పుడైనా ఆన్ లైన్ ఫండ్ ట్రాన్స్ ఫర్ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీని ప్రకారం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ (నెఫ్ట్) ద్వారా ఈ సౌకర్యం లభించనుంది. ఆర్బీఐ తన పేమెంట్ అండ్ సెటిల్ మెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా: విజన్ 2019-2021లో ఈ ప్రతిపాదన ఉంచింది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ (ఆర్టీజీఎస్)లో వినియోగదారుల లావాదేవీల కోసం పరిశ్రమ సన్నద్ధత, వినియోగదారుల డిమాండ్ ఆధారంగా ఈ సదుపాయాన్ని విస్తరించే అవకాశాలను ఆర్బీఐ పరిశీలించనుంది.

నెఫ్ట్ సమయాన్ని పొడిగించడానికి ముందు దీనిని పరీక్షించడం తప్పనిసరని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం నెఫ్ట్ బ్యాంకింగ్ సమయాల్లో రెండు గంటల వ్యవధిలో జరుగుతుంది. ఇప్పుడు నెఫ్ట్ లో ఆదివారం, నెలలో రెండు, నాలుగు శనివారాలు, బ్యాంక్ హాలిడే రోజుల్లో లావాదేవీలు చేయలేరు. పని చేసే రోజుల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే నెఫ్ట్ ని ఉపయోగించవచ్చు. పని చేసే శనివారాల్లో కూడా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే నెఫ్ట్ పనిచేస్తుంది. ఆన్ లైన్ ఆర్టీజీఎస్ లావాదేవీల సమయం మరీ తక్కువ. ప్రస్తుతం దీని ద్వారా సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే డబ్బు ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. ప్రతి బ్యాంకు వేర్వేరు ట్రాన్సాక్షన్ సమయం పాటిస్తోంది.

కస్టమర్లు నెఫ్ట్ ద్వారా ఒక్క రోజులో ఎక్కడికైనా రూ.1 లక్ష నుంచి రూ.25 లక్షల వరకు నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి పంపగలుగుతున్నారు. ఆర్టీజీఎస్ తో ఒక రోజులో రూ. 2 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపవచ్చు. బ్యాంకులు వేర్వేరు ట్రాన్సాక్షన్ లిమిట్ విధిస్తున్నాయి. కేవలం ఐఎంపీఎస్ ద్వారా మాత్రమే 7 రోజులు, 24 గంటలు వెంటనే డబ్బు పంపిచేందుకు వీలవుతోంది. కానీ దీనితో గరిష్ఠంగా రూ. 2 లక్షలు మాత్రమే ట్రాన్స్ ఫర్ చేయవచ్చు.