గృహరుణాల దిగ్గజం దివాలా..! డీహెచ్‌ఎఫ్‌ఎల్ బోర్డు రద్దు చేసిన ఆర్బీఐ..

గృహరుణాల దిగ్గజం దివాలా..! డీహెచ్‌ఎఫ్‌ఎల్ బోర్డు రద్దు చేసిన ఆర్బీఐ..

ప్రైవేట్‌రంగానికి చెందిన గృహ రుణాల దిగ్గజం దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్) దివాలా తీసింది. ఇది దేశంలోనే మూడో అతిపెద్ద గృహ రుణాల సంస్థ. గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ సంస్థను పాలనాపరమైన అంశాలు, నగదు సంక్షోభం కుదేలాయ్యేలా చేశాయి. దీంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను దివాలా కోర్టుకు సిఫార్సు చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). గత జూలై నాటికి డీహెచ్‌ఎఫ్‌ఎల్ రుణభారం రూ.83,873 కోట్లుగా ఉంది. ఇందులో సెక్యూర్డ్ రుణం రూ. 74,054 కోట్లు కాగా... అన్-సెక్యూర్డ్ రుణం రూ.9,818 కోట్లు.. చాలా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం లేదు డీహెచ్‌ఎఫ్‌ఎల్. దీంతో మొండి బకాయిలుగా భావించి... నిరర్థక ఆస్తిగా ప్రకటించాయి. ఇటీవలే డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లను దేశం విడిచి వెళ్లొద్దని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. తమకు రావల్సిన రూ. 200 కోట్ల కోసం 63 మూన్స్ టెక్నాలజీస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ దేశం విడిచి వెళ్లొదని డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వాధవాన్, కపిల్ వాధవాన్లు ఆదేశిచింది బొంబాయి హైకోర్టు.