మన నోట్లు ఇక మెరుస్తాయి..

మన నోట్లు ఇక మెరుస్తాయి..

నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి వచ్చిన నోట్లపై ప్రజల్లో అంత పాజిటివ్ రెస్పాన్స్ లేదు.. ఇవి నోట్లేనా? పాత కరెన్సీయే బెటర్ అనే టాక్ వినిపించింది. ఆర్బీఐ విడుదల చేసిన ఏ నోటును తీసుకున్నా.. ఇవేం నోట్లురా బాబూ అంటూ సెటైర్లు వేశారు. అయితే, మొదటగా వంద నోట్లపై దృష్టి పెట్టింది ఆర్బీఐ.. ఈ నోట్ల మన్నికను పెంచేందుకు చర్యలు చేపట్టిన సెంట్రల్ బ్యాంక్.. ప్రయోగాత్మకంగా ఈ నోట్లపై వార్నిష్‌ పూత వేయనున్నట్టు తన వార్షిక నివేదికలో పేర్కొంది. వార్నిష్‌ పూతతో ఇక రూ.100 నోట్లు మెరుస్తాయని తెలిపింది. మరోవైపు ప్రస్తుతం సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో తన పనితీరు, విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని యోచిస్తోన్న ఆర్బీఐ.. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో అడుగుపెట్టబోతోంది.

ఆర్బీఐ వార్షిక నివేదికలోని ప్రధాన అంశాలు:
* 17 శాతం పెరిగిన నగదు చెలామణీ.. మార్చి 2019 నాటికి నగదు చెలామణీ 17 శాతం దారా పెరిగింది. 
* చెలామణీలో ఉన్న నగదులో రూ.500 నోటుదే అగ్రభాగం.. రూ.500 నోటు 51 శాతం వాటా కలిగి ఉంది. 
* గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు మోసాలు అంతక్రితం ఏడాదితో పోలిస్తే 15 శాతం పెరిగాయి. 
* ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే అధిక మోసాలు జరగ్గా.. ఆ తర్వాతి స్థానాల్లో ప్రైవేటు రంగ, విదేశీ బ్యాంకులున్నాయి. 
* ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.64,509.43 కోట్ల విలువైన 3,766 కేసులు నమోదయ్యాయి. 
* ఇపుడు వినియోగాన్ని, ప్రైవేటు పెట్టుబడులను పెంచడమే అందరికీ ‘అత్యంత ప్రాధాన్యం’గా ఉండాలి. బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర రంగాలను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యం. 
* కార్మిక చట్టాలు, పన్ను, ఇతర చట్ట సంస్కరణలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అంచనా కంటే ఎక్కువగా గిరాకీ బలహీనపడింది. రైతు రుణ మాఫీలు, ఏడో వేతన సంఘ నివేదిక అమలు, వివిధ ఆదాయ మద్దతు పథకాలు కలిసి ద్రవ్య ఉద్దీపనలు ఇచ్చే సామర్థ్యాన్ని తగ్గించాయి. 
* మెరుగైన రుతుపవానాల వల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉండొచ్చు. 
* ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ఆర్బీఐ ఆగంతుక నిధి రూ.1.96 లక్షల కోట్లకు తగ్గింది. ప్రభుత్వానికి అదనంగా రూ.52,000 కోట్లు ఇవ్వడమే దీనికి కారణం.
* బ్యాంకుల్లో ఒత్తిడిలో ఉన్న ఆస్తులను ముందస్తుగా గుర్తించడంతో 2018-19 నాటికి స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 9.1 శాతానికి పరిమితం.