ఆ 12 మంది రాజీనామా చేయాల్సిందే..!

ఆ 12 మంది రాజీనామా చేయాల్సిందే..!

కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఆర్సీ కుంతియా... 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి అనైతిక చర్య అని... ఇది సరైంది కాదన్న ఆయన.. కాంగ్రెస్ టికెట్‌తో ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించి... ఇప్పుడేమో మాకు కాంగ్రెస్‌లో భవిష్యత్ లేదని చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలిచి, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం చట్ట విరుద్ధం... నీతి నియమాలు ఉంటే అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని.. రాజకీయాలలో నీతి నియమాలను పాటించాలని సూచించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు కుంతియా.. ఈ వ్యవహారంపై గవర్నర్‌కి కూడా పిర్యాదు చేశామని.. అయినా ఎలాంటి స్పందన లేదన్నారు. ఇదే అంశంపై హైకోర్టులో కూడా కేసు నడుస్తోందని.. హైకోర్టులో కేసు గెలుస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఇక, వీహెచ్ వ్యవహారంపై స్పందించిన కుంతియా.. గతంలో వీహెచ్‌ కూడా 2 సార్లు పీసీసీగా చేశారని గుర్తుచేశారు. కానీ, టీపీసీసీ పదవి మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి రాలేదన్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌లో కవిత ఓటమితో కేసీఆర్ ఒక గుణపాఠం నేర్చుకోవాలని సూచించారు కుంతియా. తెలంగాణలో కేసీఆర్ కి ప్రజాదరణ తగ్గిందని అభిప్రాయపడ్డ ఆయన.. కేసీఆర్ మొదట అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుందన్నారు.