జైలు తప్పించుకొనేందుకు అనిల్ అంబానీకి మిగిలింది 4 రోజులే

జైలు తప్పించుకొనేందుకు అనిల్ అంబానీకి మిగిలింది 4 రోజులే

ఇటీవలే జరిగిన ఎరిక్సన్ కేసులో చెల్లింపులు జరపడానికి అనిల్ అంబానీ దగ్గర ఇంకా 4 రోజులే మిగిలాయి. అనిల్ అంబానీ మార్చి 19 నాటికి ఎరిక్సన్ కి రూ.453 కోట్లు చెల్లించాల్సి ఉంది. అనిల్ అంబానీ అలా చెల్లించకపోతే ఆయన జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. సుప్రీంకోర్ట్ ఆదేశాల ప్రకారం ఆయన ఎరిక్సన్ కంపెనీకి ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఇందుకోసం అనిల్ కు 4 వారాల గడువు ఇవ్వడం జరిగింది.

ఎన్సీఎల్ఏటీ ఇలా ఆదేశించింది
ఎరిక్సన్ బకాయిలు చెల్లించడానికి అనిల్ అంబానీకి సుప్రీంకోర్ట్ ఇచ్చిన గడువు పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు శుక్రవారం నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఆయనకు రావాల్సిన ఆదాయపన్ను రిఫండ్ జారీ చేయాలని ఎస్బీఐని ఆదేశించేందుకు నిరాకరించింది. ఇది తన అధికార పరిధిలోకి రాదని ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని గుర్తు చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వనంత వరకు నిధులకు సంబంధించి తాను ఎలాంటి సూచనలు చేయనని తెలిపింది.

రూ.46,000 కోట్ల రుణం 
బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్) రూ.46,000 కోట్ల రుణాలు చెల్లించాలి. ఈ ఇబ్బందుల మధ్య అనిల్ అంబానీ తనకు ఇన్ కమ్ ట్యాక్స్ రిఫండ్ నుంచి వచ్చే మొత్తాన్ని విడుదల చేయాలని కోరారు. దీనిని ఎస్బీఐ సహా ఎన్నో బ్యాంకులు వ్యతిరేకించాయి.

చైర్మన్ ఇలా చెప్పారు 
ఎన్సీఎల్ఏటీ చైర్మన్ జస్టిస్ ఎస్.జె. ముఖోపాధ్యాయ, ఇతర సభ్యులు జస్టిస్ బన్సీలాల్ భట్ తో కూడిన బెంచ్ ' దివాలా మరియు రుణ చెల్లింపు అసమర్థత కోడ్ సెక్షన్ 61 కింద దాఖలైన అప్పీలులో ఏ పక్షానికీ పరిష్కారం గురించి సూచనలు ఇవ్వబడవు. ఇతర పక్షాల మధ్య సర్దుబాటు చేసుకోవాలని ప్రత్యేకించి మూడో పార్టీలకు చెప్పలేం' అని చెప్పింది.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ న్యాయవాది వాదన 
సుప్రీంకోర్ట్ ఏవైనా ఆదేశాలు ఇచ్చే వరకు మే 30, 2018న ఇచ్చిన తాత్కాలిక ఆదేశాలను తొలగించడం లేదని ఎన్సీఎల్ఏటీ తెలిపింది. అలాగే ఎలాంటి మొత్తాన్ని వాపసు ఇవ్వడంపై ఎలాంటి తాత్కాలిక ఆదేశాలు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. కంపెనీ ఎరిక్సన్ కి రూ.453 కోట్లు చెల్లించేందుకు మిగిలిన మొత్తాన్ని అప్పు తీసుకుంటుందని ఆర్ కామ్ న్యాయవాది కపిల్ సిబ్బల్ తెలిపారు. ఆర్ కామ్ ఇప్పటికే ఎరిక్సన్ కి రూ.118 కోట్లు చెల్లించింది.