దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: కుళ్లిపోయిన మృతదేహాలు..! రీపోస్టుమార్టానికి రెడీ..!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌: కుళ్లిపోయిన మృతదేహాలు..! రీపోస్టుమార్టానికి రెడీ..!

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత నిందితుల మృతదేహాలను కోర్టు ఆదేశాలతో భద్రపరిచారు. డిసెంబర్ 6న తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. స్పాట్‌లోనే గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ టీం పోస్ట్‌మార్టం నిర్వహించింది. అయితే ఎన్‌కౌంటర్ పై పౌరహక్కుల సంఘాల అనుమానాలతో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్విహించకుండా.. ముందుగా మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీలో మూడు రోజుల పాటు ఉంచారు. అయితే అక్కడ మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ సౌకర్యం లేదని.. కోర్టు అనుమతితో డిసెంబర్ 9న సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. దిశ నిందితులు మహ్మద్ ఆరీఫ్, చెన్నకేశవులు.. జొల్లు శివ, నవీన్ మృతదేహాలను 7,8,10,11 ఫ్రీజర్ బాక్సుల్లో భద్రపరిచారు.

వాస్తవానికి మృతి చెందగానే శరీరాన్ని ఫ్రీజర్ లో పెట్టాలి. కానీ పోస్ట్ మార్టం .. ఆ తర్వాత మహబూబ్ నగర్లో మూడు రోజుల పాటూ ఉంచటంతో అప్పటికే దిశ నిందితుల మృత దేహాల్లో డీ కంపోజిషన్ మొదలైంది. అప్పటికే డీ కంపోజ్ మొదలైన మృతదేహాలను గాంధీ మార్చూరీలోని ఫ్రీజర్లలో ఉంచినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే మృతదేహాలు యాభై శాతం పాడయ్యాయి. ఇదే విషయాన్ని శనివారం హైకోర్టు దర్మాసనానికి గాంధీ సూపరిండెంట్ వివరించారు. దాంతో సోమవారం సాయంత్రం 5 గంటల లోపు మరోసారి పోస్ట్ మార్టం చేసి.. దాన్ని మొత్తం వీడియో రికార్డింగ్ చేసి.. మృతదేహాలను బంధువులకు అప్పగించాలని ఆదేశించింది కోర్టు. అంతేకాదు వీడియో రికార్డు మొత్తం కోర్టుకు సమర్పించాలని తెలిపింది. కోర్టు ఆదేశాలతో ఇవాళ ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్ల పర్యవేక్షణలో దిశ నిందితుల మృతదేహాలకు మళ్లీ పోస్ట్‌మార్టం జరగనుంది. ఇప్పటికే ఎయిమ్స్ బృందం హైదరాబాద్ చేరుకుంది. ఉదయం 9 గంటల నుంచి దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం జరగనుంది. ఒక్కో మృతదేహం పోస్టుమార్టానికి రెండు గంటల సమయంపట్టే అవకాశముంది. సాయంత్రం నాలుగు గంటలవరకు ఈ ప్రక్రియ జరగనుంది. ఆతర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తారా లేదా అనేది చూడాలి.