"షుగర్ తగ్గాలంటే భగవద్గీత చదవండి"

"షుగర్ తగ్గాలంటే భగవద్గీత చదవండి"

ఈ మధ్య కాలంలో భగవద్గీత వినిపించిందంటే.. ఎవరో పోయారనే అనుకోవాలి. అయితే ఎవరైనా త్వరగా పోకుండా ఉండేందుకు కూడా గీత ఉపయోగపడుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. మనవాళ్లు కనీసం ఇప్పుడైనా ఈ పద్ధతి మార్చుకుంటారో లేదో తెలీదు కానీ.. వివరాల్లోకి వెళదాం.

మన హైదరాబాద్ లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య నిపుణులతో పాటు బంగ్లాదేశ్ లోని ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ మిట్ఫోర్డ్ హాస్పిటల్ నిపుణులు.. కరాచీలోని ఆగాఖాన్ యూనివర్సిటీ హాస్పిటల్ నిపుణులు కలిసి భగవద్గీత శ్లోకాల ప్రభావంపై అనేక మంది పేషెంట్ల మీద పరిశోధన చేశారు. వారి అధ్యయనం ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీలో పబ్లిష్ కూడా అయింది. 


గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన అంశాల ఆధారంగా.. పని నుంచి వెనక్కి లాగుతున్న నెగెటివ్ అంశాలు గుర్తింపులోకి వచ్చి పాజిటివ్ స్కిల్స్ గ్రహించడం జరుగుతుందని పరిశోధకుల బృందం అభిప్రాయపడింది. డయాబెటిస్ అనేది లైఫ్ స్టైల్ ద్వారా సంక్రమించే వ్యాధి అని.. అది అటాక్ అయిందంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని హెచ్చరించడమేనని వారు అభివర్ణిస్తున్నారు. షుగర్ కంట్రోల్ కోసం క్రమం తప్పని కసరత్తు, డైట్ వంటి బేసిక్ యాక్టివిటీస్ మార్చుకోవడంతో పాటు గీతాపారాయణం చేసినట్టయితే దాని ప్రభావం గణనీయంగా ఉంటుందంటున్నారు. 

గీత అనేది కేవలం మతానికి పరిమితమైందే కాదని, అందులోని 700కు పైగా ఉన్న శ్లోకాలు మనిషిని అంతర్ముఖుణ్ని చేస్తాయని, అందువల్ల ఇది విశ్వజనీనమైందని వారంటున్నారు. డయాబెటిక్ పేషెంట్లు రోజూ ఆ శ్లోకాలు వినడం ద్వారా వారు యాక్టివేట్ అవుతారు. ప్రతి రోజూ ఇన్సులిన్ తీసుకున్నా షుగర్ కంట్రోల్ కానివారికి గీత చక్కగా పనిచేస్తుందంటున్నారు.