కష్టపడ్డ వారికి గుర్తింపు లేదు...రాజీనామాకి సిద్దమన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే !

కష్టపడ్డ వారికి గుర్తింపు లేదు...రాజీనామాకి సిద్దమన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే !

ఈరోజు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్ కు ఆయన ‘గుడ్ బై’ చెప్పనున్నారని ప్రచారం మొదలయింది. ఈ నేపథ్యంలో షకీల్ స్పందించారు. తెరాసలో పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు లభించడం లేదని, ప్రస్తుత పరిస్థితులలో పార్టీలో ఇమడలేకపోతున్నానని, అవసరమైతే, రాజీనామా చేసేందుకూ సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే కేసీఆర్ దయతోనే ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పిన షకీల్, కేసీఆర్ ను కొందరు తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లో ఏకైక ముస్లిం ఎమ్మెల్యే తానేనని గుర్తు చేసిన ఆయన మంత్రి పదవి ఇవ్వలేదని ఆవేదన చెందారు. ఇక తమ పార్టీ నేతలు ఎంఐఎం నేతలు చెప్పినట్టుగా వింటున్నారని ఆరోపించారు.  ధర్మపురి అరవింద్‌తో అన్ని విషయాలు చర్చించాననీ, సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. దీంతో ఆయన బీజేపీ చేరిక ఖరారయినట్టేనని సమాచారం.