తహశీల్దార్ సజీవదహనం.. కారణం ఇదే..!

తహశీల్దార్ సజీవదహనం.. కారణం ఇదే..!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ దారుణ హత్యకు గురయ్యారు. కార్యాలయంలోనే తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు సురేష్ అనే వ్యక్తి... మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన సురేష్.. సుమారు అరగంటపాటు విజయారెడ్డితో మాట్లాడాడు.. అనంతరం తహశీల్దార్ రూమ్‌ డోర్ మూసివేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించి.. అనంతరం ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలోనే తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం కాగా.. గాయాలపాలైన సురేష్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.. ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ అయ్యిందని చెప్పినట్టుగా తెలుస్తున్నా.. భూ వివాదమే తహశీల్దార్ హత్యకు కారణంగా భావిస్తున్నారు. 

నిందితుడు సురేష్‌ది హయత్‌నగర్ మండలం గౌరెల్లి గ్రామం.. బాచారంలోని 7 ఎకరాల విషయంలో వివాదం నడుస్తుండగా.. సంబంధిత ల్యాండ్ వ్యవహారం కోర్టులో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మాట్లాడేందుకు వచ్చిన సురేష్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు భావిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం హయత్‌నగర్ పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు సురేష్. ఇక, విజయారెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఘటన జరిగిన తహసీల్దార్ కార్యాలయాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘటనా తీరుపై ఆరా తీశారు. మరోవైపు తహశీల్దార్‌ను కాపాడేందుకు యత్నించి ఇద్దరు సిబ్బందికి కూడా గాయాలు కాగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు పోలీసులు.