ఆ 86 గోవుల మృతికి కారణం అదే !

ఆ 86 గోవుల మృతికి కారణం అదే !


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడ గోశాల ఆవుల మృతి ఘటనపై నివేదిక అందించింది సిట్ బృందం. ఇప్పటికే పూర్తి అయిన దర్యాప్తునకు సంబంధించి, నివేదికను సీపీకి సమర్పించింది సిట్‌. గ్రాసంలో చేరిన అధిక శాతం నైట్రేట్ల కారణంగానే ఆవులు మరణించాయని సిట్ తేల్చింది. ఆగస్టు, 10వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 86 ఆవులు మరణించాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం స్పందించి సిట్‌ను ఏర్పాటు చేసింది. సభ్యులను సీపీ ద్వారకా తిరుమలరావు నియమించారు. వివిధ ప్రయోగశాలల్లో చేయించిన పరీక్షలలో విష ప్రయోగం జరిగినట్లు ఆనవాళ్లు లభించలేదు.

గడ్డి ద్వారానే ఆవులు చనిపోయాయని నివేదికల్లో బయటపడింది. సాధారణంగా పచ్చి గడ్డిలో ఉండే నైట్రేట్ల కంటే ఆవులు తిన్న గడ్డిలో ఎక్కువ ఉండడం వల్ల ఆవులు మరణించాయి. సాధారణంగా గడ్డిలో ఒకటి పాయింట్ ఆరు శాతం లోపు ఉండాలి. అంతకంటే ఎక్కువైతే గడ్డి విషపూరితం అవుతుంది. ఆవులకు ఇచ్చిన గడ్డిలో నైట్రైట్‌ శాతం 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. ఎక్కువ పరిమాణంలోని నైట్రేట్లు హిమోగ్లోబిన్‌లోకి వెళ్లిన తర్వాత చర్య జరిగి మెత్‌హిమోగ్లోబిన్‌గా మారింది. దీని వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌కు  ప్రాణవాయువును తీసుకెళ్లే సామర్థ్యం తగ్గడంతో శ్వాస ఆగిపోయి గోవులు మృతి చెందాయని నివేదికలో తెలిపింది సిట్.