పవన్ కళ్యాణ్‌పై రాపాక తెగింపుకు కారణమేంటి..?

పవన్ కళ్యాణ్‌పై రాపాక తెగింపుకు కారణమేంటి..?

ఆ పార్టీకి ఆయన ఏకైక ఎమ్మెల్యే. కానీ ఎప్పుడూ ఆ పార్టీకి విధేయత ప్రకటించలేదు. ఇప్పుడు ఏకంగా తను వేరే పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకొంటున్నారు. అనర్హత వేటుకు సిద్ధం అయ్యారా? పార్టీ తనను ఏమీ చేయలేదనే ధైర్యమా? 

పార్టీకి అవసరం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తారు!

రాపాక వరప్రసాద్. జనసేన ఏకైక ఎమ్మెల్యే. కానీ ఆయన ఇప్పుడు తాను వైసీపీ ఎమ్మెల్యేనని ప్రకటించుకున్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఎమ్మెల్యేలు వెళ్లడం మామూలే. కానీ ఆ విషయాన్ని ఎక్కడా బయపెట్టారు. తాము చేరిన పార్టీకి అవసరం వచ్చినప్పుడల్లా... తాము గెలిచిన పార్టీ అధినేతను టార్గెట్ చేస్తూ తిట్టిపోస్తుంటారు. గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఈ ట్రెండ్ సాగుతోంది. పార్టీ మారడానికి సిద్ధమైన తర్వాత నుంచి అధినేతను, పార్టీని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ దూరం అవుతారు. అలాగని రాజీనామా చేయరు. అధికారికంగా మాతృ పార్టీలోనే ఉంటారు.. కానీ పని అంతా అధికారంలోఉన్న పార్టీకి చేసేస్తుంటారు. అనర్హత వేటుకు దొరకకుండా ఉండేందుకు ఈ టాక్టీస్‌ను జంపింగ్ ఎమ్మెల్యేలు ఫాలో అవుతున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేనని చెప్పుకొన్న రాపాక!
తన గెలుపులో జనసేన పాత్ర శూన్యమని చెప్పారు!

కానీ.. రాపాక పూర్తిగా రూటు మార్చారు. ఏకంగా తాను వైసీపీ ఎమ్మెల్యేనని చెప్పుకొన్నారు. జనసేన గాలివాటం పార్టీ అని..  అసలు రాజోలులో వైసీపీ సీట్ రావాల్సింది తనకేనని... అన్నారు. చివరి నిమిషంలో సీట్ మిస్ అవడం.. జనసేన నాయకులంతా తనను పోటీ చేయాలని కోరడంతో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగానని ఆయన అన్నారు. అంటే తన గెలుపులో జనసేన పాత్ర సూన్యం అన్నట్టు చెప్పేశారు రాపాక. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఇలాంటి స్టేట్‌మెంట్లే ఇచ్చారు. పవన్ వ్యతిరేకించిన ఆంగ్ల మాధ్యమాన్ని ఆయన సమర్థించారు. సీఎం జగన్‌ను పవన్ విమర్శిస్తే.. అసెంబ్లీలో సీఎం సూపర్ అని అన్నారు రాపాక. అయితే ఈసారి ఏకంగా తనను తాను వైసీపీ ఎమ్మెల్యేగా... రాజోలులో వైసీపీలో ఉన్న మూడు గ్రూపుల్లో తనదీ ఒకటిగా ఆయన చెప్పడమే చర్చనీయాంశమైంది. 

అనర్హతకు అవకాశం ఉన్నా ఎందుకు పబ్లిక్‌గా మాట్లాడారు?
జనసేన బలహీనతను రాపాక పట్టేశారా?

ఇంత తెగువ రాపాకకు ఎందుకు వచ్చింది? అనర్హత ఫిర్యాదుకు అవకాశం ఉన్నా ఆయన పబ్లిక్‌గా ఎందుకు మాట్లాడారు? ఆయన ధైర్యం ఏంటి? అంటే.. రెండు రకాలుగా చెప్పొచ్చు. ఒకటి తాను తన పార్టీ నాయకత్వాన్ని ఎన్ని మాటలు అన్నా... ఏం అన్నా... జనసేన రియాక్ట్‌ కాకపోవడం. గతంలో అనేక సందర్భాల్లో పార్టీ లైన్ దాటినప్పటికీ జనసేన నుంచి కనీసం షోకాజ్ కూడా రాపాకకు వెళ్లలేదు. సరికదా.. జనసేన షోకాజ్ ఇచ్చిందని ఓ ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వస్తే... నో .. నో అలాంటిదేమీ లేదు.. మేము ఆయనకు ఎక్కడ షోకాజ్ నోటీసు ఇచ్చాం... అంటూ జనసేన అధికారికంగా వివరణ ఇచ్చింది. పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే.. అదీ ఎస్సీ సామాజికవర్గం కావడంతో రాపాక విషయంలో జనసేన నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకే ఆయన ఏమన్నా పట్టించుకోకుండా వదిలేసింది. వీటిని పార్టీ బలహీనతలుగా రాపాక భావించినట్టున్నారు. అందుకే ఈసారి ఇంకాస్త టోన్ పెంచేశారు. 

జనసేన ఫిర్యాదు చేసినా వేటు పడదనే ధైర్యమా?

ఇక రెండో కారణం... ఒక వేళ తనపై అనర్హత కోసం జనసేన స్పీకర్ కు కంప్లైంట్ చేసినా.. వేటు పడదనే ధైర్యం కావొచ్చు అంటున్నారు. టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు పలికిన వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులు ఇంకా విచారణలోనే ఉన్నాయి. స్పీకర్ ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు. తన మీద ఫిర్యాదు చేసినా... అదే పరిస్థితి ఉండవచ్చని రాపాక అంచనా అట. పైగా తాను మాట్లాడేది ప్రభుత్వం పక్షాన కావడం... పవన్‌ను టార్గెట్ చేయడం అధికార పక్షానికీ ఇష్టమే కాబట్టి ఏ రకంగా చూసినా తను సేఫ్ అని ఆయన భావిస్తున్నారట.