మోడీ, జిన్‌పింగ్ భేటీ.. మహాబలిపురం ఎంపిక వెనుక అసలు కథ..!

మోడీ, జిన్‌పింగ్ భేటీ.. మహాబలిపురం ఎంపిక వెనుక అసలు కథ..!

ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశం కానున్నారు.. గతేడాది ఏప్రిల్‌లో ఇద్దరు నేతలు చైనాలోని వూహాన్‌లో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఈ సమావేశం భారత్‌లో జరగనుంది. అందుకే ఈ భేటీకి చెన్నై సమీపంలోని చరిత్రాత్మక నగరం మహాబలిపురాన్ని ఎంపిక చేశారు. ఇందుకు కారణం లేకపోలేదు. చైనాకు, ఈ ప్రదేశానికి వందల ఏళ్ల క్రితమే చారిత్రక సంబంధం ఉంది. 7, 8వ శతాబ్ధంలో పల్లవరాజులు మహాబలిపురాన్ని మహానగరంగా మలిచారు. మూడో పల్లవరాజు కుమారవిష్ణువు.. బౌద్ధమత వ్యాప్తికి విశేష కృషిచేశాడు. బోధిదర్ముడిగా మారి చైనీయులకు ఆరాధ్య గురవయ్యాడు. ఆయన మూలాలు మహాబలిపురంలోనే ఉండటం కూడా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడానికి ఓ కారణం అంటున్నారు. 

ఇప్పటికే సర్వాంగ సుందరంగా షోర్ టెంపుల్‌ను తీర్చిదిద్దారు. ఆలయంలో అవసరమైన చోట ఫ్లోరింగ్‌ మార్చారు. పురావస్తు శాఖ ఉన్నతాధికారులు, నిపుణులు, కన్సల్టెంట్లు  ఇప్పటికే ఈ ప్రాంతాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. ఇద్దరు నేతలు, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటు ఐదు చారిత్రక రథాలనూ సందర్శించి.. కొంత సేపు ఈ పరిసరాల్లో కాలి నడకన తిరిగే అవకాశం ఉంది. ఇద్దరూ కలిసి కూర్చుని ఫోటోలు దిగేందుకు అనుకూలంగా బెంచీలు సిద్దం చేశారు. దేశాధినేతలిద్దరూ ఎక్కడ కూర్చుంటారో, ఎక్కడ నిలబడతారో, ఏ దారిలో నడుస్తారో.. అనే అంచనాలతో, ఆలయంతో పాటు.. పరిసరాలన్నీ శుభ్రం చేసి, అలంకరించారు. అంతేకాదు.. మోదీ,  జిన్‌ పింగ్‌ అక్కడకు వచ్చినప్పుడు వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఆలయ ఆవరణలో ఇసుక పరిచారు. అయితే చారిత్రక ఆలయాన్ని చర్చల వేదికగా ఎంచుకోవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నా... ఆ పేరుతో ఆలయంలో జరుగుతున్న పనులు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. దేశాధినేతల పర్యటన పేరుతో ఆలయానికి ఉన్న సహజసిద్ధ అందాలను మార్చడం మంచిది కాదని చరిత్ర ప్రేమికులు, పర్యావరణవేత్తలు అంటున్నారు. వందలేళ్ల చరిత్రకు వారసత్వంగా ఆలయం అసలు రూపంలో ఉంటేనే దానికి అందమని,  ఇలా మార్పులు చేస్తే సహజత్వాన్ని కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు.