మంత్రి తలసాని కామెంట్స్‌పై గంగపుత్రుల ఆగ్రహం...

మంత్రి తలసాని కామెంట్స్‌పై గంగపుత్రుల ఆగ్రహం...

ఆ మంత్రి తీరు తలనొప్పిగా మారిందా? రెండు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారా? చివరకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని ప్రకటించాల్సి వచ్చిందా? అధికార పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? లెట్స్‌ వాచ్‌!

తలసాని వ్యవహారం తలనొప్పిగా మారిందా? 

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ ఇటీవల చేసిన కామెంట్స్‌పై సోషల్‌ మీడియాలో అనుకూలంగా ప్రతికూలంగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అంతేస్థాయిలో టీఆర్‌ఎస్‌లోనూ చర్చ జరుగుతోంది.  ఇప్పటి వరకు ఈ అంశంపై అవగాహన లేనివారు సైతం అసలు తలసాని ఏం అన్నారు? ఎందుకింత రియాక్షన్‌ వస్తోంది అని ఆరా తీస్తున్నారట. దాంతో తలసాని  వ్యవహారం తలనొప్పిగా మారిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

చెరువుల్లోని చేపలపై ముదిరాజ్‌లకే హక్కుందన్న తలసాని!

మంత్రి తలసాని ఏం మాట్లాడినా కొట్టినట్టే ఉంటుంది. పర్యవసనాలను అస్సలు పట్టించుకోరు. కొన్నిసార్లు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు వ్యవహారం ఉంటుందట. తాజా ఎపిసోడ్‌లోనూ అదే జరిగిందనే కామెంట్స్‌ జోరందుకున్నాయి. ఇటీవల కోకాపేట్‌లోని ముదిరాజ్‌ భవన్‌ శంకుస్థాపన కార్యక్రమానికి తలసాని హాజరయ్యారు. ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముదిరాజ్‌ సామాజికవర్గాన్ని ఆకర్షించాలని ప్రయత్నించారో ఏమో పెద్ద తేనెతుట్టనే కదిపారు. చెరువులలో పెరిగిన చేపలపై పూర్తి హక్కులు ముదిరాజ్‌లకు ప్రభుత్వం ఇచ్చింది... ఏమైనా ఇబ్బందులొస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని మంత్రి సలహా ఇచ్చారు. అంతేకాదు.. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కూడా. 

తలసానిపై గంగపుత్రులు గరంగరం!

తలసాని ఈ వ్యాఖ్యలు ఇలా చేశారో లేదో గంగపుత్ర సామాజికవర్గానికి చెందినవారు భగ్గుమన్నారు.  తమ హక్కులను హరించే విధంగా మంత్రి కామెంట్స్‌ చేశారని ఆరోపిస్తూ.. ఏకంగా ఆయన్ని కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్నారు గంగపుత్రులు. మంత్రి క్షమాపణ చెప్పాలని రోడ్డెక్కారు. హైదరాబాద్‌ దిగ్భందనానికి పిలుపిచ్చారు. అంతేకాదు.. మంత్రి వ్యాఖ్యలు కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమని పలు సంఘాలు సైతం రాగం అందుకున్నాయి. 

క్షమాపణ చెప్పేందుకు సిద్ధమన్న తలసాని!

ఈ సెగ అటు పార్టీకి.. ఇటు మంత్రి తలసానికి కూడా తాకాయట. ఈ స్థాయిలో రియాక్షన్‌ ఉంటుందని మంత్రి కూడా ఊహించలేదట. దాంతో ముదిరాజ్‌ భవన్‌ శంకుస్థాపన సందర్భంగా చేసిన కామెంట్స్‌పై ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. గంగపుత్రులను బాధపెట్టేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు తలసాని.  ఒకవేళ తన కామెంట్స్‌ తప్పుగా ఉన్నాయని భావిస్తే.. క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 

పార్టీకి ఇబ్బంది రాకూడదనే వెనక్కి తగ్గారా? 

ముదిరాజ్‌, గంగపుత్రుల వివాదంలో తలసాని నుంచి వచ్చిన తాజా కామెంట్స్‌పై కొత్త చర్చ మొదలైంది. ఈ వ్యవహారం పార్టీకి కూడా ఇబ్బంది తెచ్చే పరిస్థితి ఉండటంతో తలసాని వెనక్కి తగ్గారా  అని ఆరా తీస్తున్నారట. ఈ వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టేందుకు మంత్రి చొరవ తీసుకున్నా సద్దుమణుగుతుందో లేదో చూడాలి.