ట్రంప్ ఇండియా రావడం వెనుక ఇంత కధ ఉందా ?

ట్రంప్ ఇండియా రావడం వెనుక ఇంత కధ ఉందా ?

అధ్యక్షుడిగా ఎవరున్నా.. అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీట. అందులోనూ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఇండియాకు వచ్చారు ట్రంప్. భారత్‌తో వ్యాపార- వాణిజ్య ఒప్పందాల్లో అగ్ర రాజ్యానికే అధిక ప్రాధాన్యం అనేది ట్రంప్ వైఖరి. మన ప్రయోజనాలు దెబ్బ తినకుండా.. అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాధ్యమేనా?.

ట్రంప్ పర్యటనలో బాగంగా.. భారత్‌తో భారీ ఒప్పందాలు కుదుర్చుకునే ప్రతిపాదనలేవీ సిద్ధంగా లేవని సమాచారం. ట్రంప్‌ తో పాటు భారత్ రావాల్సిన అమెరికా వాణిజ్య విభాగం ప్రతినిధి నెల రోజుల కిందటే తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే రెండు దేశాల మధ్య పరిమిత ఒప్పందం కుదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రక్షణ విభాగానికి సంబంధించిన హెలికాప్టర్ల కొనుగోలుపై ట్రంప్- మోడీ సంతకాలు చేయనున్నారు. ఆరు అపాచీ హెలికాప్టర్లతో పాటు 60 రోమియో హెలికాప్టర్ల కొనుగోలుకు రెండు దేశాల అధిపతులు సంతకాలు చేసే అవకాశం ఉంది.

భారత్‌ కు చైనా తర్వాత అతి పెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికానే. అగ్రరాజ్యంతో 2018లో 142 బిలియన్ డాలర్ల వర్తకం జరిగింది. 1995లో ఇది 11.2 బిలియన్ డాలర్లు మాత్రమే. భారత్‌తో వాణిజ్య బంధం మరింత బలపడాలని అమెరికా కోరుకుంటోంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు భారత్‌లో మంచి మార్కెట్ ఉందనేది అగ్ర రాజ్యం అభిప్రాయం. పాల ఉత్పత్తులతో పాటు పత్తి, శనగలు, బాదం పప్పు, చికెన్‌ లెగ్ పీసెస్ అమ్మకం గురించి భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఉత్పత్తులపై పన్నుల్ని తగ్గించాలని కోరుతున్నారు. అయితే మన రైతుల ప్రయోజనాల దృష్ట్యా మోడీ సర్కారు.. ఈ విషయంలో ట్రంప్‌ ప్రతిపాదనను అంగీకరించడం లేదు.

అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే హార్లే డేవిడ్‌సన్ మోటార్‌ సైకిళ్లపై భారత ప్రభుత్వం 75 శాతం పన్ను విధిస్తోంది. ఈ పన్నుని తగ్గించాలని ట్రంప్ ఒత్తిడి తేవడంతో మోడీ సర్కారు 75 శాతం ఉన్న పన్నుని 50 శాతానికి తగ్గించింది. అమెరికా విజ్ఞప్తుల పట్ల భారత్ ఎంత సానుకూలంగా స్పందించినా ట్రంప్ వైఖరి మొండిగానే ఉంది. భారతీయులకు వీసాలు తగ్గించడం, H4 వీసాదారులకు పని చేసుకునే అనుమతి తొలగించడం భారత్ నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై భారీగా పన్నులు పెంచడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారాయన. ట్రంప్ నిర్ణయాల వల్ల భారతీయ సాఫ్ట్‌ వేర్ కంపెనీలకు అనేక తలనొప్పులు వచ్చాయి.

భారత్ రష్యా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలు, రక్షణ రంగానికి సంబంధించిన కొనుగోళ్లు చేయడం ట్రంప్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. యుద్ధ విమానాలు, జెట్‌ ఫైటర్లను అమెరికా నుంచి కొనుగోలు చేయాలని కోరుతున్నారాయన. అమెరికా నుంచి కొనకపోయినా.. రష్యా నుంచి కొనద్దని నేరుగానే చెబుతున్నారు. రక్షణ రంగంలో భారత్‌తో  రెండు లక్షల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకోవచ్చని.. దీని వల్ల అమెరికాలో 60వేల మందికి ఉపాధి లభిస్తుందనేది ట్రంప్ ఆలోచన. దీన్ని పట్టాల మీదకు తెచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే మోడీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో.. మోడీ టఫ్ నెగోషియేటర్ అంటూ హ్యూస్టన్ సభలో సెటైర్ వేశారు.

ప్రస్తుతం ట్రంప్ భారత్‌తో ఎలాంటి ఒప్పందాలు లేకున్నా.. రానున్న రోజుల్లో అమెరికాతో జరిగే ఒప్పందాల్లో అగ్ర రాజ్య ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తారు. ఈ విషయంలో భారత్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటారని ఆశించడం అత్యాశే. రక్షణ, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఒప్పందాల మాట ఎలా ఉన్నా.. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన అగ్రిమెంట్లలో దేశంలో కోట్ల మంది జీవితాల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం అవసరం. 
ముంబయిలో వాలీబాల్ టోర్నీ చూడటానికి వస్తానని హ్యూస్టన్‌లో చెప్పిన డొనాల్డ్ ట్రంప్... అన్నట్లుగానే భారత్ వచ్చేశారు. ట్రంప్ పర్యటనపై రకరకాల సూత్రీకరణలు చేస్తున్నా.. అధ్యక్ష ఎన్నికలే అసలు కారణం అనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదిలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అమెరికాలో భారతీయుల ఓట్ల కోసమే ట్రంప్ మోడీ జపం చేస్తున్నారా?. మోడీ చెబితే.. అమెరికాలో భారతీయులంతా ట్రంప్‌కే ఓటేస్తారా? అనేది ఆలోచించాల్సిన విషయమే.