నిజామాబాద్‌లో వెల్లువలా 'రైతు'ల నామినేషన్లు..

నిజామాబాద్‌లో వెల్లువలా 'రైతు'ల నామినేషన్లు..

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలివిడుత ఎన్నికలు నిర్వహిస్తోన్న నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్ ఎంపీ కవిత ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున రైతులు నామినేషన్లు వేయడం చర్చగా మారింది. దీంతో నిజామాబాద్‌ లో పోరు రసవత్తరంగా మారపోయింది. రాజకీయ నాయకులే కాదు వందల సంఖ్యలో రైతులు సైతం నామినేషన్లు వేయడానికి ఉదయం నుంచి బారులు తీరి నామినేషన్లు వేయడం మరో విశేషం. దీంతో నిజామాబాద్‌ పార్లమెంట్ స్థానానికి మొత్తం 236 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ ఒకే రోజు 173 నామినేషన్లు వేశారు. నామినేషన్లు దాఖలు చేసినవారిలో 230 మంది రైతులు ఉన్నారు. వీరిలో పసుపు, ఎర్రజొన్న, చెరకు రైతులు ఉన్నారు. పసుపు, ఎర్రజొన్న, చెరకు పంటలకు మద్దతు ధర కల్పించాలని సుదీర్ఘపోరాటం చేస్తున్న రైతులు... ఎన్నికలను కూడా తమ పోరాటానికి వేదికగా చేసుకున్నారు. తమ సమస్యను జాతీయం చేసేందుకు నిజామాబాద్ ఎంపీ స్థానానికి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో పసుపు, ఎర్రజొన్న సాగు చేసే రైతులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా పసుపు సాగు చేసే రైతులు నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోనే ఎక్కువగా ఉన్నారు. వీరంతా తాము సాగు చేసిన పసుపు, ఎర్రజొన్న పంటలకు సరిపడా గిట్టుబాటు ధర రావడం లేదంటూ గత కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. అయినా ప్రభుత్వాల నుంచి సరైన స్పందన రాకపోవడంతో వినూత్న తరహాలో నామినేషన్ల వేశారు. కాగా, 236 అభ్యర్థులు రంగంలోకి ఉంటే.. ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల అధికారులకు సవాల్‌గా మారింది.