పింక్‌బాల్‌ టెస్ట్‌ లో ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు...

పింక్‌బాల్‌ టెస్ట్‌ లో ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు...

పింక్‌బాల్‌ టెస్ట్‌ రెండు జట్లకు కీలకం. అటు ఆటగాళ్లకు కూడా ఈ టెస్ట్‌ స్పెషల్‌గా నిలువబోతుంది. టీమిండియా, ఇంగ్లండ్‌ ఆటగాళ్ల రికార్డులకు మొతేరా వేదిక కాబోతుంది. అరుదైన ఘనత సృష్టించేందుకు ఆటగాళ్లు అతి చేరువలో ఉన్నారు. ఇషాంత్‌ సెంచరీ టెస్ట్‌తో పాటు.. కోహ్లీ, అశ్విన్‌ కొత్త రికార్డులకు పింక్‌బాల్‌ టెస్ట్‌ ఊరిస్తోంది..!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే రెండు జట్లకు మొతేరా మ్యాచ్‌ ఎంతో కీలకం. అందుకే రెండు జట్లు శ్రమిస్తున్నాయ్‌. జట్టు విజయాలతో పాటు అటు ఆటగాళ్లకు మొతేరా స్పెషల్‌గా నిలువనుంది. అరుదైన రికార్డులకు కొందరు ఆటగాళ్లు అతి చేరువలో ఉన్నారు. ఆ ఘనతలను మొతేరాలో నమోదు చేయాలని పట్టుదలతో ఉన్నారు. 

కోహ్లీని.. ధోని రికార్డు ఊరిస్తోంది. స్వదేశంలో టెస్ట్‌ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా నిలవడానికి ఒక్క విజయం దూరంలో మాత్రమే నిలిచాడు. ప్రస్తుతం ఆ జాబితాలో కోహ్లీ, ధోనీ 21 విజయాలతో సమానంగా ఉన్నారు. అయితే విరాట్ 28 టెస్టుల్లో గెలవగా మహీ 30 టెస్టుల్లో సాధించాడు. దీంతో పాటు మరో రికార్డుపై కన్నేశాడు కోహ్లీ. ఈ టెస్ట్‌లో మరో 37 పరుగులు సాధిస్తే.. టెస్ట్‌లలో 7500 పరుగులు సాధించిన ఆరో భారత ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం కోహ్లీ 89 టెస్టుల్లో 52 సగటుతో 7463 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తే.. పింక్ బాల్ టెస్టులో రెండు సెంచరీలు చేసిన తొలి కెప్టెన్ రికార్డ్ సృష్టించనున్నారు. 2019 లో కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో జరిగిన డే-నైట్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించడంలో పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ అసద్ షఫీక్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మార్నస్ లబుషెన్ ముందంజలో ఉన్నారు. షఫీక్, లబుషెన్ ఇద్దరూ నాలుగు డే-నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడి చెరో 2 సెంచరీలు సాధించారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మరో 16 మంది బ్యాట్స్‌మెన్లు ఒక్కో సెంచరీ చేశారు.

ఇషాంత్‌ శర్మకు పింక్‌బాల్‌ టెస్ట్‌..  వందో మ్యాచ్‌ కాబోతుంది. కపిల్‌దేవ్‌ తర్వాత 100 టెస్టులు ఆడిన రెండో భారత పేసర్‌గా నిలవడానికి ఇషాంత్ శర్మ మరో మ్యాచ్‌ దూరంలో ఉన్నాడు. అంతేగాక వికెట్ల పరంగానూ లంబూ మరో ఘనతపై కన్నేశాడు. తొమ్మిది వికెట్లు సాధిస్తే జహీర్‌ఖాన్‌.. 311 వికెట్లను అధిగమిస్తాడు. ఇప్పటివరకు ఇషాంత్‌ శర్మ 302 వికెట్లు తీశాడు.

ఇండియా స్పిన్‌ సంచలనం అశ్విన్‌ సంచలన రికార్డుకు కొన్ని వికెట్ల దూరంలో ఆగిపోయాడు. భారత్‌ తరఫున 400 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలవడానికి రవిచంద్రన్ అశ్విన్ ఆరు వికెట్లు దూరంలో ఉన్నాడు. ఆ ఘనత సాధిస్తే ప్రపంచ క్రికెట్‌లో 400 వికెట్లు మార్క్‌ను అందుకున్న 16వ బౌలర్‌గా అశ్విన్‌ నిలుస్తాడు. ఇక రోహిత్‌ శర్మ.. ఈ టెస్ట్‌లో 25 పరుగులు చేస్తే 2500 రన్స్‌ మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా నిలుస్తాడు. 

ఇంగ్లండ్‌ ప్లేయర్లను కూడా రికార్డులు ఊరిస్తున్నాయ్‌. అత్యధిక వికెట్లు సాధించిన మూడో బౌలర్‌గా నిలవడానికి జేమ్స్ అండర్సన్‌ తొమ్మిది వికెట్ల దూరంలో ఉన్నాడు. అండర్సన్‌ ఇప్పటివరకు 611 వికెట్లు తీశాడు. ఇంకో 9 వికెట్లు తీస్తే.. అనిల్‌ కుంబ్లే 619 వికెట్లను అధిగమిస్తాడు. మురళీధరన్‌, షేన్‌వార్స్‌ తర్వాత నిలుస్తాడు. ఇలా మొతేరా టెస్ట్‌... ఆటగాళ్ల రికార్డులకు వేదిక కాబోతుంది.