గిన్నిస్ రికార్డ్.. 6690 వజ్రాలతో ఉంగరం  

గిన్నిస్ రికార్డ్.. 6690 వజ్రాలతో ఉంగరం  

గుజరాత్‌ లో ఇద్దరు ఆభరణ తయారీదారులు గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కారు. వీరిద్దరూ ఏకంగా 6690 వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని తయారుచేసి పాత రికార్డులను అధిగమించేశారు. గతంలో అంటే 2015లో 3827 కట్‌ డైమండ్స్‌తో పికాక్‌ రింగ్‌ పేరుతో రికార్డ్ నమోదైంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఆ రికార్డును అధిగమించి చరిత్ర సృష్టించారు. దీంతో నూతన సువర్ణాధ్యాయానికి తెరలేపినట్లయింది.  

తాజాగా సూరత్‌కు చెందిన విశాల్‌ అగర్వాల్‌, ఖుష్బూ అగర్వాల్‌ ఇద్దరూ కలిసి 6690 వజ్రాలతో నూతనంగా ఉంగరాన్ని రూపొందించి రికార్డ్ సృష్టించారు. ఈ ఉంగరం తయారీకి ఆరునెలలు పట్టింది. 48 పూరేకుల తామరపువ్వు ఆకారంలో 18 కేరెట్ల రోజ్‌ గోల్డ్‌తో రూపొందించిన ఈ ఉంగరం బరువు 58 గ్రాములు. కమలం ఆకారంలో నీటిలో ఉంటుందని, జలసంరక్షణపై చైతన్యం పెంచడం కోసమే ఈ ఉంగరాన్ని రూపొందించామని.. విశాల్‌, ఖుష్బూ తెలిపారు. గిన్నిస్‌ రికార్డ్స్‌ ఫేస్‌బుక్‌ పేజీలో 4 లక్షల మంది చూసిన ఈ ఉంగరం ఖరీదు రూ.28 కోట్లు.