భారత్ లో రెడ్డిట్, టెలిగ్రామ్ వంటి వెబ్ సైట్లు బ్లాక్!?

భారత్ లో రెడ్డిట్, టెలిగ్రామ్ వంటి వెబ్ సైట్లు బ్లాక్!?

భారత్ లోని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు రెడ్డిట్, టెలిగ్రామ్ వంటి వెబ్ సైట్లు, యాప్ లను తమ నెట్ వర్క్ లపై బ్లాక్ చేస్తున్నాయి. దీంతో దేశంలో నెట్ న్యూట్రాలిటీ నియమాల అమలు ప్రశ్నార్థకంగా మారిందని కొన్ని ఇంటర్నెట్ గ్రూప్ లు బుధవారం ఆరోపించాయి.

కాపీరైట్ చట్టాల ఉల్లంఘనను నిరోధించేందుకు భారత్ లో ఉచితంగా సినిమాలు, మ్యూజిక్ డౌన్ లోడ్ చేసుకోవడాన్ని అనుమతించే టారెంట్ సైట్లపై ఆంక్షలు అమల్లో ఉ్నాయి. అలాగే చిన్నపిల్లలకు అందుబాటులో లేకుండా పోర్నోగ్రఫీ వెబ్ సైట్లను బ్లాక్ చేయాలన్న కోర్టు ఉత్తర్వుల మేరకు నిషేధం అమలవుతోంది. 

కానీ ఇటీవల కొన్ని నెలలుగా చర్చలకు వేదికగా ఉండే రెడ్డిట్ వంటి వెబ్ సైట్లు, టెలిగ్రామ్ మెసేజింగ్ సర్వీస్, కామెడీ సైట్ కాలేజ్ హ్యూమర్ మధ్య మధ్యలో బ్లాక్ అవుతున్నాయి. తరచుగా కొన్ని రోజుల పాటు, కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ అవుతుండటంపై ఇంటర్నెట్ యూజర్లు ఆశ్చర్యపోతున్నారు.

'ఇదంతా ఏం జరుగుతోందో దీనికి అసలు అర్థమే లేదని' లాభాపేక్ష రహిత ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అపార్ గుప్తా వ్యాఖ్యనించారు. 'ఈ బ్లాక్ లలో చాలా వాటికి అసలు ఎలాంటి నోటీసులు చూపకుండా చేస్తున్నారని' చెప్పారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో, భారతీ ఎయిర్ టెట్, హ్యాథ్ వేలు నిర్వహించే నెట్ వర్క్ లపై జనవరి నుంచి ఇప్పటి వరకు కనీసం 250 వెబ్ సైట్లు బ్లాక్ చేసినట్టు ఫిర్యాదులందినట్టు ఐఎఫ్ఎఫ్ టెలికామ్ డిపార్ట్ మెంట్ కి రాసిన లేఖలో పేర్కొంది.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వెబ్ సైట్ బ్లాక్ చేసినట్టు వచ్చిన మెసేజ్ లను కొందరు ఇంటర్నెట్ యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజ నిర్ధారణ కోసం రాయిటర్స్ కూడా కాలేజ్ హ్యూమర్.కామ్ ను బుధవారం యాక్సెస్ చేయబోతే 'మీరు కోరిన యుఆర్ఎల్ భారత ప్రభుత్వ టెలికామ్ శాఖ నుంచి అందిన సూచనల మేరకు బ్లాక్ చేయడమైందని' సందేశం కనిపించింది. దీనిపై వ్యాఖ్యానించేందుకు డీఓటీ అధికారులు నిరాకరిస్తున్నారు.

గత ఏడాది ఆమోదించిన నెట్ న్యూట్రాలిటీ నియమాల ప్రకారం ఇంటర్నెట్ లోని అన్ని వెబ్ సైట్లు, డేటాను సమానంగా పరిగణించాల్సి ఉండగా ఇలా చేస్తుండటం నెట్ న్యూట్రాలిటీని ఉల్లంఘించడమేనని ఐఎఫ్ఎఫ్ ఆరోపిస్తోంది. 

ఐఎఫ్ఎఫ్ డేటా ప్రకారం జనవరి నుంచి అందిన ఫిర్యాదుల్లో 60 శాతం జియో నెట్ వర్క్స్ కి చెందినవే ఉన్నాయి. దీనిపై జియో నుంచి ఎలాంటి వివరణ రాలేదు. హ్యాథ్ వే కూడా ఈ వ్యవహారంపై నోరు మెదపడం లేదు. 'ఓపెన్ ఇంటర్నెట్ కి మద్దతు' ఇస్తామని, అధికారుల నుంచి సూచనలు వస్తే తప్ప బ్లాక్ చేయబోమని భారతీ ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. కానీ ప్రస్తుతం ఏవైనా వెబ్ సైట్లని బ్లాక్ చేసిందీ లేనిదీ మాత్రం చెప్పలేదు.

ఇక రెడ్డిట్, టెలిగ్రామ్ లు కూడా ఈ వ్యవహారంపై గొంతు విప్పడం లేదు. ప్రభుత్వ లేదా కోర్టు ఉత్తర్వుల మేరకు వెబ్ సైట్లను బ్లాక్ చేసినా..వెబ్ పేజీలను చట్టపరమైన కారణాలతో ఇంటర్నెట్ సంస్థలు బ్లాక్ చేసినా నెట్ న్యూట్రాలిటీ నియమాలను ఉల్లంఘించినట్టు కాదు. కానీ ఇప్పుడు జరుగుతోంది ఏంటో ఎవరికీ స్పష్టత లేకపోవడంతో ఇంటర్నెట్ యూజర్లు గందరగోళంలో ఉన్నారు.