'రైల్వే జోన్‌పై కేంద్రం సానుకూలం'

'రైల్వే జోన్‌పై కేంద్రం సానుకూలం'

విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ హామీ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. పియూష్‌ గోయల్‌తో ఏపీ బీజేపీ నేతలు ఇవాళ ఢిల్లీలో సమావేశమయ్యారు. అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ రైల్వే జోన్‌ అంశంపై గోయల్‌ సానుకూలంగా స్పందించారని అన్నారు. మార్చి 1న ప్రధానమంత్రి  విశాఖకు వస్తున్నందున మరోసారి రైల్వే శాఖ మంత్రిని కలిశామని.. రైల్వేజోన్ పై ఉన్న సెంటిమెంట్‌ను రైల్వే మంత్రికి వివరించామని చెప్పారు. రైల్వే జోన్ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టిందని..అధికారంలో ఉన్న రోజున కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఎందుకు చట్టంలో పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో చిత్తశుద్ధి లేదన్నారాయన. రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రజలను మోసం చేస్తున్నారన్న కన్నా.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అన్నారు.  

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలుగా ప్రత్యేక సహాయం చేస్తోందన్న కన్నా.. కేంద్రం చేస్తున్న సహాయంపై బయటకు చెప్పకుండా ఏపీ సీఎం చంద్రబాబు జిత్తులమారి నక్కలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏ రాష్ట్రానికీ చేయనంత సహాయం ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం చేసిందన్నారు. చంద్రబాబు గుమాస్తా చలసాని శ్రీనివాస్‌, సినీ నటుడు శివాజీ ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగలా దొరికి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చారని.. ఉమ్మడి రాజధానిని వదిలేసుకుని భారీ మూల్యం చెల్లించుకున్నారని కన్నా అన్నారు. ఏపీ ప్రజలు ఈ వాస్తవం తెలుసుకుని చంద్రబాబును తరిమేయడం ఖాయమన్న కన్నా.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో భారీ ఎత్తున అవినీతికి చంద్రబాబు పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబుకు సహకరించేవారు రాష్ట్ర  ద్రోహులని అభిప్రాయపడ్డారు.