ఇస్లాం నుంచి ఫాతిమాను బహిష్కరిస్తున్నాం

ఇస్లాం నుంచి ఫాతిమాను బహిష్కరిస్తున్నాం

మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను ఇస్లాం మతం నుంచి బహిష్కరిస్తున్నట్లు కేరళ రాష్ట్ర ముస్లిం జమాత్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. శబరిమల ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించింది. ఆమె చేసిన పని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని తెలిపింది. మహల్లు కమిటీ నుంచి ఫాతిమాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ముస్లిం జమాత్‌ కౌన్సిల్‌కి సూచించింది. ఫాతిమా చర్యలు హిందువుల ఆచారాలకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపింది. అంతేగాక, ఆమె గతంలో ‘కిస్‌ ఆఫ్‌ లవ్’ ఉద్యమంలోనూ పాల్గొన్నారని, ఆమెకు ముస్లిం పేరు‌ ఉండే అర్హతను కోల్పోయిందని రాష్ట్ర ముస్లిం జమాత్ కౌన్సిల్ ప్రకటించింది.

శుక్రవారం రోజు ఫాతిమా శబరిమలకు వెళ్లిన సమయంలోనే పనంబిల్లీ నగర్ లోని ఆమె ఇంటిపై ఆందోళనకారులు దాడి చేశారు. గతంలో మోడలింగ్ కూడా చేసిన ఫాతిమా ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫాతిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని పథనంతిట్టి పోలీస్‌ స్టేషన్‌లో పలువురు కేసు కూడా నమోదు చేశారు.