రిలయన్స్‌... 3నెలల్లో రూ. 10,251 కోట్ల నికర లాభం

రిలయన్స్‌... 3నెలల్లో రూ. 10,251 కోట్ల నికర లాభం

దేశ చరిత్రలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చరిత్ర సృష్టించింది. కేవలం మూడు నెలల్లో రూ. 10,000 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన తొలి ప్రైవేట్‌ కంపెనీగా రికార్డు సృష్టించింది. డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 10,251 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో నికర లాభంతో పోలిస్తే 8.82 శాతం పెరిగింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 9,540 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్‌  వర్గాలు భావించాయి. కంపెనీ వరుసగా ప్రతి త్రైమాసికంలోనూ అధిక నికర లాభం నమోదు చేయడం ఇది 16వ సారి. రీటైల్‌తో పాటు జియో విభాగం అనూహ్య ప్రగతి సాధించడంతో కంపెనీ నికర లాభం రికార్డు స్థాయికి చేరిందని కంపెనీ పేర్కొంది. ఈ మూడు నెలల్లో కంపెనీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 55.9 శాతం పెరిగి రూ. 1,71,336 కోట్లకు చేరింది. పన్నులకు ముందు కంపెనీ నికర లాభం రూ. 9.3 శాతం పెరిగి రూ. 14,445 కోట్లకు చేరగా, నికర లాభం 8.8 శాతం పెరిగి రూ. 10,251కి చేరినట్లు కంపెనీ ప్రకటించింది. కంపెనీ గ్రాస్‌ రిఫైనింగ్‌ మార్జిన్‌ కూడా ఈ త్రైమాసికంలో బ్యారెల్‌కు 8.8 డాలర్లుగా నమోదైంది.
జియో రికార్డు
మూడు నెలల కాలంలో రిలయన్స్‌ జియో రూ. 10,000 కోట్ల నిర్వహణ టర్నోవర్‌ను సాధించింది. వివిధ రకాల సేవల ద్వారా కంపెనీ అందించిన సేవల మొత్తం రూ. 12,252 కోట్లు కాగా ఆపరేటింగ్‌ టర్నోవర్‌ 50 శాతం పెరిగి రూ. 10,383 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఒక్క విభాగం నికర లాభం రూ. 831 కోట్లకు చేరింది.