జియో చేతికి టిక్‌టాక్..!?

జియో చేతికి టిక్‌టాక్..!?

టిక్‌టాక్‌ ఎప్ప‌టి నుంచో ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ఉన్నా... భార‌త్ - చైనా జ‌వాన్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌ర‌గ‌డం.. వెంట‌నే చైనా సోష‌ల్ మీడియా యాప్స్‌పై భార‌త్ నిషేధం విధించ‌డం.. అందులోనూ టిక్‌టాక్ ఉండ‌డంతో.. చాలా దేశాలు టిక్‌టాక్‌పై బ్యాన్ విధించే దిశ‌గా అడుగులు వేశాయి... అగ్ర‌రాజ్యం అమెరికా అదేదారిలో వెళ్తోంది. మ‌రో అడుగు ముందుకేసి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్.. సెప్టెంబర్‌లోగా టిక్‌టాక్ అమెరికాకు చెందిన కంపెనీ చేతులోకి రావ‌డ‌మా? లేదా బ‌్యాన్ విధించ‌డ‌మా? ఏదోఒక‌టి తేలిపోవాల‌ని డెడ్‌లైన్ పెట్టారు. ప‌లు అమెరిక‌న్ సంస్థ‌లు టిక్‌టాక్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతూనే ఉన్నాయి.. ఇక‌, ఇదే స‌మ‌యంలో.. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ తాజాగా భారత్‌పై ఫోక‌స్ పెట్టింది. భారత్‌లో తన వ్యాపారాల‌ను రిలయన్స్ జియోకి కట్టబెట్టేందుకు ఈ  షార్ట్ వీడియో మేకింగ్ యాప్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

భార‌త్ - చైనా మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల‌తో భార‌త్‌లో తన కార్యకలాపాలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలోనే బైట్‌డ్యాన్స్ ఈ నిర్ణ‌యానికి వ‌చ్చింద‌నే చ‌ర్చ సాగుతోంది.. గత నెలాఖరులోనే ఇరు కంపెనీలు చర్చలు ప్రారంభించాయ‌ని.. అయితే ఒప్పందంపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేద‌ని చెబుతున్నారు. కానీ, ఈ ప‌రిణామాల‌పై మాత్రం బైట్‌డ్యాన్స్ గానీ, రిలయన్స్ జియో గానీ.. ఎలాంటి అధికారిక స‌మాచారాన్ని పంచుకోలేదు. కాగా, భార‌త్‌లో  టిక్‌టాక్ వ్యాపారం 3 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుంద‌నేది ఓ అంచనా. ప్రస్తుతం భార‌త్‌లో 2 వేలకు పైగా ఉద్యోగులు టిక్‌టాక్‌లో ప‌నిచేస్తున్నారు.. కార్య‌క‌లాపాలు నిలిచిపోవ‌డంతో... కొత్త ఉద్యోగాల మాట ఏమోగానీ.. ఉన్న ఉద్యోగులే వేరే ఉద్యోగాలు వెతికేప‌నిలో ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రి జియో - టిక్‌టాక్ చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌ద‌మ‌వుతాయేమో చూడాలి. ఇక‌, ఇదే స‌మ‌యంలో.. ప్ర‌ధాని మోడీపై విమ‌ర్శ‌లు చేసేవారు కూడా లేక‌పోలేదు... టిక్‌టాక్‌పై బ్యాన్ విధించింది.. త‌న మిత్రుడు అంబానీ కోస‌మేనా అంటూ సోష‌ల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజ‌న్లు.