ధరలు పెంచనున్న రిలయన్స్ జియో?!

ధరలు పెంచనున్న రిలయన్స్ జియో?!

ప్రైవేట్ రంగ టెలికామ్ దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఈ ఆర్థిక సంవత్సరంలో ధరలు పెంచక తప్పేలా లేదు. ఫైబర్, టవర్ ఆస్తులను విడదీసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ)తో దీర్ఘకాల సామర్థ్య లీజింగ్ ఒప్పందాల కారణంగా ఏటా రూ.9,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుండటం, ప్రత్యర్థి కంపెనీలైన వోడాఫోన్ ఐడియా(వీఐఎల్), భారతి ఎయిర్ టెల్ పెట్టుబడులు పెంచుకొనే ప్రణాళికలు రచిస్తుండటంతో జియో టారిఫ్స్ పెంచే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. 

'ఆరు నుంచి నెలల క్రితం కంటే ఇవాళ జియో ధరలు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇతర కంపెనీలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా వోడాఫోన్ ఐడియాకి' అని యుఎస్ బ్రోకరేజ్ సంస్థ జెపి మోర్గాన్ చెప్పింది. వోడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ పెట్టుబడులు పెంచుకొనే ప్రణాళికలపై మదుపరుల విశ్వాసం పెరుగుతున్నట్టు సంస్థ తెలిపింది. ఆయా సంస్థల పోరాట సామర్థ్యం సూచనప్రాయంగా తెలుస్తుండటంతో జియో తన ధరలపై పునరాలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబోయే రెండు మూడేళ్ల పాటు తన బ్యాలెన్స్ షీట్ లో పెట్టుబడులను పెంచుకుంటూ పోగలదా అనేది కీలకం కానుంది. 

వీఐఎల్, ఎయిర్ టెల్ సుమారుగా చెరో రూ.25,000 కోట్లు రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించాలని భావిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా 4జీ సామర్థ్యం పెంచుకొని జియోతో అమీతుమీ తేల్చుకోవాలని అనుకుంటున్నాయి. అయితే జియో యాజమాన్యం మాత్రం ప్రస్తుత టారిఫ్స్ మార్చే యోచనే లేదని గత వారం పునరుద్ఘాటించింది. సబ్ స్క్రైబర్ మార్కెట్ షేర్ ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టినట్టు చెప్పింది.

సెప్టెంబర్ 2016 నుంచి జియో దూకుడైన ధరల వ్యూహం కారణంగా ఇతర కంపెనీలు తమ వినియోగదారులను నిలుపుకొనేందుకు రేట్లు తగ్గించడంతో పాటు వాయిస్, డేటా సర్వీస్ లను కారుచౌకగా అందిస్తున్నాయి. ఈ ధరల యుద్ధంతో యూజర్లు లాభపడినప్పటికీ భారత్ లో పాత కంపెనీలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. అయితే 16 నెలలకు పైగా ధరలు కనిష్ఠ స్థాయిలో నిలకడగా ఉంటూ వచ్చాయి. ముఖ్యంగా మార్కెట్ ముగ్గురు ప్రైవేట్ కంపెనీలకే పరిమితమై పోయింది.