హాత్‌వేలో రిలయన్స్‌కు వాటా

హాత్‌వేలో రిలయన్స్‌కు వాటా

రహేజాలకు  చెందిన హాత్‌వేలో వాటా కొనుగోలుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రంగం సిద్ధం చేసింది. బ్రాడ్‌బాండ్‌ సర్వీసుల్లోకి భారీ ఎత్తున ప్రవేశించాలని భావిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌... ఇదే రంగంలోని కంపెనీలపై కన్నేసింది. ఏకంగా కంపెనీలను కొనుగోలు చేయడానికి బదులు... కీలక వాటాను కొనుగోలు చేసి ఆ కంపెనీల బోర్డుల్లో పాగా వేయాలని యోచిస్తోంది. తరవాత ఈ పరిశ్రమ పురోగతి చూసి మొత్తం కంపెనీని కొనుగోలు చేయాలా లేదా ఉన్న వాటాతోనే కొనసాగాలా అన్నది నిర్ణయించుకోవచ్చని రిలయన్స్‌ భావిస్తోంది. మొత్తానికి హాత్‌వేతో పాటు డెన్‌ నెట్‌వర్క్స్‌లో కీలక వాటాను కొనుగోలు చేసి ఆయా కంపెనీల డైరెక్టర్ల బోర్డులో చేరాలని రిలయన్స్ భావిస్తోంది.

బోర్డు మీటింగులు...
మరిన్ని నిధులు సమీకరించే అంశాన్ని పరిశీలించేందుకు  హాత్‌వే, డెన్‌ నెట్‌వర్స్స్‌ త్వరలోనే సమావేశం కానున్నాయి. వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించే ప్రతిపాదనలకు బోర్డు ఆమోదించే అవకాశముంది.  ఒక్కో కంపెనీలో కనీసం 25 శాతం వాటా కొనుగోలు చేయాలని రిలయన్స్‌ భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రిలయన్స్‌ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ జియో మీడియా కంపెనీకి దేశ వ్యాప్తంగా కేబుల్‌ వ్యాపారం చేసేందుకు లైసెన్స్‌ ఉంది. ఈ కంపెనీ ద్వారానే ఇతర కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసే అవకాశముంది.