రీమేక్స్ కింగ్ .. రాజా!

రీమేక్స్ కింగ్ .. రాజా!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్' తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్ చరణ్‌తో కలిసి ప్రముఖ పంపిణీదారుడు ఎన్.వి.ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ విషయం ఈ మధ్యే వెలుగులోకి వచ్చింది. ఈ చిత్ర దర్శకునిగా మోహన్ రాజాను ఎంచుకోవడానికి ఓ కారణముంది. ఇంతకూ ఈ రాజా ఎవరయ్యా అంటే.. ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ పెద్దకొడుకు.  ఎడిటర్ మోహన్ ఎంతటి సినిమా ప్రియుడో ఆయన సన్నిహితులందరికీ తెలుసు. ఇక ఆయన సతీమణి లక్ష్మి కూడా భర్తకు తగ్గ భార్య. వీరిద్దరికీ అంతర్జాతీయ సినిమాతోనూ పరిచయం ఉన్నవారే. ఎడిటర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసిన మోహన్ రీమేక్ మూవీస్ తోనే నిర్మాతగా పలు విజయాలు సాధించారు. ఆయన నిర్మించిన రీమేక్స్‌ లో "మామగారు, బావ-బావమరిది, హిట్లర్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, శుభమస్తు, మానసిచ్చిచూడు" వంటి సూపర్ హిట్స్ ఉన్నాయి. ఆయన ఇద్దరు తనయులలో పెద్దవాడు రాజా దర్శకుడిగా, చిన్నవాడు రవి హీరోగా ఇద్దరూ చిత్రసీమలోనే రాణిస్తారు. రాజా 'హనుమాన్ జంక్షన్'తో దర్శకుడయ్యాడు. ఇది 'తెన్ కాశీపట్నం' మళయాళ హిట్ మూవీకి రీమేక్. అంటే రాజా కూడా తండ్రినే ఫాలో అవుతూ రీమేక్‌నే నమ్ముకున్నాడన్న మాట.
ఈ సినిమా డిసెంబర్ 21తో 19 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఆ మధురజ్ఞాపకాన్ని రాజా గుర్తు చేసుకుంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో మురిసిపోయాడు. ఆ తరువాత తెలుగులో రాజా మరో సినిమా తెరకెక్కించింది లేదు. ఇన్నాళ్ళ  తర్వాత చిరంజీవితో 'లూసిఫర్' రీమేక్ ద్వారా తెలుగు చిత్రసీమలోకి రాజా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 'హనుమాన్ జంక్షన్' రీమేక్ తో దర్శకుడైన రాజా, తమిళనాట కూడా రీమేక్ ద్వారానే అడుగుపెట్టడం విశేషం. తన తమ్ముడు రవిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన 'జయం' తెలుగు 'జయం'కు రీమేక్. ఆ తరువాత కూడా రాజా 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' ఆధారంగా 'ఎమ్.కుమరన్ సన్నాఫ్ మహాలక్ష్మి' తెరకెక్కించి విజయం సాధించాడు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' రీమేక్ గా 'ఉనక్కుమ్ ఎనక్కుమ్' తీసి హిట్ పట్టాడు. 'బొమ్మరిల్లు' రీమేక్ గా 'సంతోష్ సుబ్రహ్మణ్యం' తీసి తమిళ జనాన్ని రంజింప చేశాడు. తెలుగు 'కిక్'ను 'థిల్లాలంగడి'గా తీసి మురిపించాడు. నాగార్జున 'ఆజాద్' ఆధారంగా 'వేలాయుధం' తీశాడు. ఇలా తండ్రి రీమేక్స్‌తో హిట్స్ పట్టేస్తే, తనయుడు రాజా డైరెక్టర్ గా రీమేక్స్ తీసి విజయాలు సాధించాడు. 
రాజా కెరీర్ లో నేరుగా తీసిన మొదటి సినిమా 'తనీ ఒరువన్'. దీని ఆధారంగానే రామ్ చరణ్ నటించి, నిర్మించిన 'ధ్రువ' రూపొందింది. రాజా డైరెక్టుగా తీసిన మరో చిత్రం 'వేలైక్కారన్' కూడా మంచి విజయం సాధించింది. రాజా అన్ని చిత్రాలలోనూ తమ్ముడు రవి హీరోగా నటించగా, 'వేలైక్కారన్'లో మాత్రం శివకార్తికేయన్ కథానాయకుడు. రాజా తండ్రి ఎడిటర్ మోహన్, చిరంజీవి హీరోగా 'హిట్లర్' చిత్రం నిర్మించి హిట్ కొట్టారు. ఈ సినిమా మళయాళ 'హిట్లర్'కు రీమేక్. ఆ చిత్రానికి ముందు వరుస పరాజయాలు చూసిన చిరంజీవి ఓ సంవత్సరం గ్యాప్ తీసుకొని మరీ నటించి, 'హిట్లర్'తో జనం ముందుకు వచ్చారు. ఆ సినిమా తర్వాత చిరంజీవి వరుస విజయాలు చూశారు. అందువల్ల ఎడిటర్ మోహన్ హ్యాండ్ లాగే ఆయన తనయుడు రాజా చేయి కూడా చిరంజీవి 'లూసిఫర్' రీమేక్‌లో కలిసి వస్తుందేమో చూడాలి.