నవ్వులతోనే సాగిన ఇ.వి.వి.

నవ్వులతోనే సాగిన ఇ.వి.వి.

'నవ్వడంలోనే యోగం ఉందన్నారు' గురువు జంధ్యాల. ఆ మాటలనే తు.చ. తప్పకుండా పాటించారు శిష్యుడు ఇ.వి.వి. సత్యనారాయణ. 'నవ్వించడంలోనూ భోగం ఉందన్నారు' అదే గురువు. దానినీ భలేగా వంటపట్టించుకున్నాడు శిష్యుడు సత్యనారాయణ. గురువు జంధ్యాల చూపిన బాటలోనే పయనిస్తూ ఇ.వి.వి. సత్యనారాయణ సైతం అనేక చిత్రాలలో నవ్వుల పువ్వులు పూయించారు. యాభైకి పైగా చిత్రాలు తెరకెక్కించిన ఇ.వి.వి. సత్యనారాయణ అన్నిటా నవ్వులకే పెద్ద పీట వేస్తూ యోగం, భోగం రెండూ అనుభవించారు. ఆ రోజుల్లో ఇ.వి.వి. సత్యనారాయణ సినిమా వస్తోందంటే చాలు అందులో నవ్వుల గుబాళింపు ఖాయం అని ప్రేక్షకులు విశ్వసించేవారు. ఇక నవ్వులు పూయించే హాస్యనటులు తమకు పాత్రలు ఖాయం అనీ నమ్మకంతో ఉండేవారు. అటు ప్రేక్షకులను, ఇటు నమ్ముకున్న నటీనటులను సంతృప్తి పరుస్తూ నవ్వుల తేరు ఎక్కి ఊరేగారు ఇ.వి.వి. సత్యనారాయణ. 

అలరించడమే ఆయనకు తెలిసిన విద్య!

అనేక చిత్రాలలో నవ్వుల పువ్వులు పూయించిన సత్యనారాయణ తొలి సినిమా టైటిల్ లోనే పువ్వుండాలని చూశారు. అదే 'చెవిలో పువ్వు' (1990). ఎందుకనో జనం ఆ పువ్వును అంతగా వాసన చూడలేదు. దాంతో డి.రామానాయుడు అందించిన ప్రోత్సాహంతో 'ప్రేమఖైదీ' తెరకెక్కించారు. ఆ సినిమాతో మంచి విజయాన్ని మూటకట్టుకున్నారు ఇ.వి.వి. అక్కడ నుంచీ వెనక్కి తిరిగి చూసుకోకుండా నవ్వుతూ ముందుకు సాగారు. ఆయన ప్రధాన లక్ష్యం నవ్వించడమే అయినా, ప్రేమకథలతో పరవశింప చేశారు. సెంటిమెంట్ తో కట్టి పడేశారు. ఎమోషన్ తోనూ ఆకట్టుకున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ సక్సెస్ ఫుల్ మూవీస్ తెరకెక్కించారు.  రాజేంద్రప్రసాద్ తో భలేగా నవ్వులు పండించారాయన. ఇక నాటి వర్ధమాన కథానాయకులు హరీశ్, వినోద్ కుమార్, శ్రీకాంత్, నరేశ్ వంటి హీరోలందరికీ ఇ.వి.వి. సినిమాలు దన్నుగా నిలిచాయి. ఇ.వి.వి. చిత్రాలలో నవ్వుల పువ్వులే కాదు, 'ఆమె' వంటి ఆలోచింప చేసే సినిమాలూ ఉన్నాయి. 

తనయులతో...

తన ఇద్దరు తనయులు రాజేశ్, నరేశ్ ను హీరోలుగా చూసుకున్నారు ఇ.వి.వి. పెద్దబ్బాయి రాజేశ్ ను తాను దర్శకత్వం వహించిన 'హాయ్' (2002)తో హీరోగా పరిచయం చేశారు. చిన్నబ్బాయి నరేశ్ తో కొన్ని విజయవంతమైన చిత్రాలనూ అందించారు. తనయులిద్దరినీ హీరోలుగా పెట్టి 'నువ్వంటే నాకిష్టం' తీశారు. ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆయన అందించిన చిత్రాలు కొన్ని జనాన్ని ఆకట్టుకున్నాయి. తమ తండ్రి నెలకొల్పిన ఇ.వి.వి. సినిమా సంస్థను నిలిపేందుకు తనయులు కూడా కొన్ని ప్రయత్నాలు చేశారు. అవేవీ అంతగా ఫలించలేదు. ఏది ఏమైనా ఇ.వి.వి. అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన తెరకెక్కించిన హాస్యరస చిత్రాలే. ఆ చిత్రాలు గుర్తుకు వచ్చినపుడల్లా ప్రేక్షకులకు కితకితలే ! 

(జనవరి 21న ఇ.వి.వి. సత్యనారాయణ వర్ధంతి)