నవ్వుల నారాయణ

నవ్వుల నారాయణ

"నవ్వడమే నా అలవాటు... నవ్వించడమే నాకిష్టం..." అంటూ సాగారు హాస్యనటులు ఎమ్.ఎస్.నారాయణ. ఆయన నవ్వుల  తీరే వేరు. కేవలం 17 సంవత్సరాల కాలంలో 700 చిత్రాలలో నటించారు ఎమ్మెస్. ఈ రికార్డును గిన్నిస్ బుక్ గుర్తించినా, గుర్తించక పోయినా, తెలుగువారికి మాత్రం ఎమ్మెస్ నారాయణ ఎప్పటికీ గుర్తుంటారు. ఆయన పంచిన నవ్వులూ గుర్తుంటాయి. 

మత్తెక్కించే నవ్వులు...

కత్తిమీద సాములాంటి హాస్యంలో పలు సాములు చేసిన ఘనుడు ఎమ్మెస్ నారాయణ. చదువుకొనే రోజుల నుంచీ ఎమ్మెస్ నవ్వులు పూయిస్తూ ఉండేవారు. తరువాత కలం పట్టి నాటకాలు రాశారు. వాటిలోనూ నవ్వులే అధికంగా పూయించారు. ఆ రచనలే చిత్రసీమలో ఎమ్మెస్ కు చోటు చూపించాయి. ఆరంభంలో రవిరాజా పినిశెట్టి వెంట ఉంటూ, ఆయన సినిమాలకు రైటర్ గా పనిచేశారు. రవిరాజా తెరకెక్కించిన కొన్ని చిత్రాల్లోనూ నటించారు. అయినా, అవేవీ ఆయనకు అంతగా గుర్తింపు సంపాదించి పెట్టలేకపోయాయి. చిత్ర పరిశ్రమను నమ్ముకుంటే వమ్ము కాము అని చాలామంది అంటూ ఉంటారు. అలాగే ఎమ్మెస్ కూడా సినిమా రంగాన్ని నమ్ముకున్నారు. చివరకు నవ్వులతో కమ్ముకున్నారు. ఇ.వి.వి. సత్యనారాయణ తెరకెక్కించిన 'మా నాన్నకి పెళ్ళి' (1997) చిత్రంతో ఎమ్మెస్ కు నటుడిగా బ్రేక్ లభించింది. అందులో తాగుబోతు పాత్రలో నటించి మెప్పించారు. ఇక అక్కడ నుంచీ ఎమ్మెస్ కు అలాంటి పాత్రలే లభించసాగాయి. అయితే వాటిలోనూ వైవిధ్యం చూపించి ఆకట్టుకున్నారు. 

ఐదు 'నందుల' నారాయణ...

ఎమ్మెస్ నారాయణలోని విలక్షణమైన హాస్యాభినయానికి జనం పడి పడి నవ్వారు. ఆ నవ్వులు పలు మార్లు అవార్డులూ, రివార్డులూ సంపాదించుకున్నాయి. ఐదు సార్లు ఉత్తమ హాస్యనటుడుగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు ఎమ్మెస్ నారాయణ. "మానాన్నకి పెళ్ళి,,  రామసక్కనోడు, సర్దుకు పోదాం రండి, శివమణి, దూకుడు" చిత్రాలతో ఎమ్మెస్ ఇంట 'నంది'వర్ధనాలు పూశాయి.  ఆయన తెరపై కనిపించగానే జనం పగలబడి నవ్వేవారు. ఆయనలోని నటుణ్ణి ఇ.వి.వి. తరువాత శ్రీను వైట్ల భలేగా ఉపయోగించుకున్నారని చెప్పాలి. 

దర్శకునిగా... 

పూర్వాశ్రమంలో ఎమ్మెస్  నాటకాలు రాసి, వేసిన సందర్భాలు ఉన్నాయి.  పైగా అధ్యాపకునిగానూ పనిచేసిన అనుభవం ఉంది. ఆ నాటకాల్లో కొన్నిటికి దర్శకత్వం కూడా వహించారు. ఈ నేపథ్యంలో నటుడిగా మారిన తరువాత ఎమ్మెస్ లో దర్శకత్వం వైపూ గాలి మళ్ళింది. తనయుడు విక్రమ్ ను హీరోగా పరిచయంచేస్తూ 'కొడుకు' సినిమాతో మెగాఫోన్ పట్టారు ఎమ్మెస్. కొడుకును హీరోగా చూసుకోవాలన్న అభిలాష నెరవేరింది. కానీ, కోరుకున్న కమర్షియల్ సక్సెస్ దరిచేరలేదు. అయినా మరో ప్రయత్నంలో 'భజంత్రీలు' తీశారు. సరిగా చప్పుడు చేయలేకపోయింది. 

ఎమ్మెస్ నారాయణ తక్కువ సమయంలోనే ఎక్కువ చిత్రాలలో నటించడమే కాదు, ఎక్కువగానూ నవ్వించారు. నారాయణ నవ్వుల నావ సజావుగా సాగుతున్న సమయంలోనే అనూహ్యంగా మునిగిపోయింది. ఎమ్మెస్ అభిమానులకు తీరని వేదన కలిగించింది. భౌతికంగా ఎమ్మెస్ మన మధ్య లేకపోయినా, ఆయన పంచిన నవ్వులు మాత్రం ఇప్పటికీ గుర్తుకు వస్తే చాలు గిలిగింతలు పెడుతూనే ఉంటాయి.


(జనవరి 23న ఎమ్.ఎస్.నారాయణ వర్ధంతి)