అమృతం కురిపించిన ఓ.పి.నయ్యర్

అమృతం కురిపించిన ఓ.పి.నయ్యర్

సంగీత దర్శకుడు ఓ.పి.నయ్యర్ బాణీలు ఎంత వైవిధ్యంగా ఉంటాయో, ఆయన వ్యక్తిత్వం కూడా అంతే విలక్షణమైనది. గానకోకిలగా జనం చేత జేజేలు అందుకున్న లతా మంగేష్కర్ గానంతో నాటి నౌషద్ మొదలు ఈ నాటి ఎ.ఆర్.రహమాన్ వరకు ఎందరో సంగీత దర్శకులు పరవశించిపోయారు, జనాన్నీ పరవశింప చేశారు. లత గానం లేకుండా హిందీ చిత్రసీమలో అగ్రస్థానం అధిరోహించిన సంగీత దర్శకులు కానరారు. అంతటి గాయనితో పనిచేయకుండానే తన స్వరకల్పనతో అగ్ర సంగీత దర్శకునిగా రాణించారు ఓ.పి.నయ్యర్. అదీ నయ్యర్ సంగీత మాహాత్మ్యం. రాజీపడడం నయ్యర్ కు తెలియని విద్య. తన దరికి చేరిన అవకాశాలకు తగిన న్యాయం చేయడానికి శ్రమించేవారు నయ్యర్. ప్రతి పాటను వైవిధ్యంగా తీర్చిదిద్దాలని తపించేవారు. ప్రయోగాలు చేసేవారు. వాటితోనే జనాన్ని రంజింపచేశారు. నయ్యర్ స్వరకల్పనలో ఎంతోమంది గాయనీగాయకులు తమ గానానికి మరిన్ని వన్నెలు అద్దుకున్నారు. 

అలరించిన స్వరవిన్యాసాలు

చిన్నతనం నుంచే ఓ.పి.నయ్యర్ సంగీత సాధన చేశారు. తన ఇరవయ్యో యేట చిత్రసీమలో అడుగు పెట్టారు. తొలుత కొందరు సంగీత దర్శకుల వద్ద అసోసియేట్ గా పనిచేశారు. 1949లో 'కనీజ్' చిత్రానికి నేపథ్య సంగీతం సమకూర్చారు. ఆ చిత్రంలోని పాటలకు గులామ్ హైదర్, హన్స్ రాజ్ బెహెల్ స్వరకల్పన చేశారు. ఈ చిత్రం తరువాత నయ్యర్ కు 'ఆస్మాన్' (1952)కు సంగీతం సమకూర్చే  అవకాశం దక్కింది. తొలి అవకాశంలోనే నయ్యర్ చేసిన స్వరవిన్యాసాలు సంగీతప్రియులను ఆకట్టుకున్నాయి. ఈ సమయంలోనే ప్రముఖనటుడు, దర్శకుడు, నిర్మాత గురుదత్ తన 'బాజ్' (1953) చిత్రానికి నయ్యర్ ను  సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. అందులో మహ్మద్ రఫీతో ఓ పాట, తలాత్ మహ్మద్ తో మరో పాట పాడించిన నయ్యర్, మిగిలిన అన్ని సోలో సాంగ్స్ ను గీతాదత్ గళంలో జాలువారేలా చేశారు. ఆ పాటలన్నీ నాటి సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో గురుదత్, ఓ.పి.నయ్యర్ సంగీతంతో సాగారు. నయ్యర్, గురుదత్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. గురుదత్ దర్శకత్వంలో రూపొందిన 'సి.ఐ.డి.' (1956)లో తొలిసారి లతా మంగేష్కర్ చెల్లెలు ఆశా భోస్లేతో "లేకే పెహ్లా పెహ్లా ప్యార్..." పాటను పాడించారు. ఆ పాట సూపర్ హిట్ అయింది. దాంతో ఆశా మరి వెనుతిరిగి చూసుకోలేదు. నయ్యర్ స్వరకల్పనలో గీతాదత్, షంషాద్ బేగం వంటి గాయనీమణులు సైతం అమృతం కురిపించారు. గాయకుడు మహేంద్ర కపూర్ తోనూ నయ్యర్ వినసొంపైన పాటలు పాడించారు. నయ్యర్ పాటలు కాశ్మీరం మొదలు కన్యాకుమారి దాకా సంగీతాభిమానులను ఎంతగానో అలరించాయి. 

తెలుగులో 'నీరాజనం'

ఓ.పి. నయ్యర్ స్వరకల్పనలో 'నీరాజనం' (1988) తెలుగు చిత్రం కూడా ఎంతగానో అలరించింది. నిర్మాత రమణమూర్తికి సంగీతమన్నా, సంగీతకళాకారులన్నా ఎంతో అభిమానం. ఆయనకు నయ్యర్ సంగీతమంటే ప్రాణం. ఆ అభిమానంతోనే రమణమూర్తి తాను నిర్మించిన 'నీరాజనం'కు సంగీతం అందించమనగానే నయ్యర్ అంగీకరించారు. ఇందులో తెలుగువారి తొలి నేపథ్య  గాయకుడు ఎమ్.ఎస్‌. రామారావు రాసిన "ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో ... " పాటను ఆయనతోనే పాడించి, స్వరపరచి  జనాన్ని మురిపించారు నయ్యర్.  ఇందులోని "నిను చూడక నేనుండలేను...", "ఘల్లు ఘల్లున..." , "మనసొక మధుకలశం..." , "ప్రేమ వెలసింది... మనసులోనే మౌనదేవతలా...", "నీ వదనం విరిసే కమలం..." , "ఊహల ఊయలలో..." , "మమతే మధురం..." వంటి పాటలు సంగీతప్రియులను ఎంతగానో అలరించాయి... ఓ.పి.నయ్యర్ సంగీతంలో ఎంతటి వైవిధ్యం వినిపిస్తుందో, ఆయన వ్యక్తిత్వం కూడా విలక్షణంగా ఉండేది. నచ్చనివారికి దూరంగా జరిగేవారు. నచ్చినవారిని అక్కున చేర్చుకొనేవారు. చివరి రోజుల్లో మిత్రులతో కలసి ఉంటూ నవ్వుతూ సాగారు. నయ్యర్ లేకపోయినా, ఆయన సంగీతం ఇంకా మనకు ఆనందం పంచుతూనే ఉంది.