రాజీనామాకు నో మార్పులకు గ్రీన్ సిగ్నల్

రాజీనామాకు నో మార్పులకు గ్రీన్ సిగ్నల్

లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేస్తానని ఇవాళ ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశంలో ప్రకటించారు. అయితే ఎప్పటిలాగే నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయత ప్రకటిస్తూ సీడబ్ల్యుసీ సభ్యులంతా రాహుల్ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తిరస్కరించారు. పార్టీలో అవసరమైన మార్పుచేర్పులు చేసేందుకు రాహుల్ గాంధీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

2014 ఎన్నికల్లో చారిత్రక స్థాయిలో 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్, ఈ సారి 8 సీట్లు మాత్రమే మెరుగై 52 స్థానాలు మాత్రమే సాధించడంతో కలిగిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. ప్రతిసారి మాదిరిగానే పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమికి తనదే బాధ్యతని చెప్పడం, షరా మామూలుగానే సీడబ్ల్యుసీ రాహుల్ తప్పేమీ లేదని చెప్పడం జరిగిపోయాయి. రాష్ట్ర పార్టీ బాధ్యులు పరాజయానికి తమదే బాధ్యతని చెప్పుకున్నారు. పైగా పార్టీ నేతలంతా ఈ ఎన్నికల్లో ఆయన పనితీరుని ప్రశంసించి పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలు అప్పజెప్పినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 'పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ ఒక్కరే బాధ్యులు కారు. కొత్త బృందం బాధ్యతలు చేపట్టడానికి వీలుగా ప్రతి రాష్ట్ర అధ్యక్షుడు తమ రాజీనామాలను పార్టీ అధ్యక్షుడికి సమర్పించాలి. నేను కూడా రాజీనామా చేయడానికి సిద్ధమని' మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్ అన్నారు.

ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఎన్నడూ చూడని విధంగా పార్టీ మరింత ఘోరంగా వైఫల్యం ఎదుర్కొంది. 2014లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారాన్ని ముందుండి నడిపారు. అయితే పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 44 సీట్లకు పతనం కావడంతో ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేస్తామని చెప్పారు. కానీ నెహ్రూ-గాంధీ కుటుంబ విధేయతకు అంకితమైన కాంగ్రెస్, ఆ ప్రతిపాదనను తిరస్కరించి పరాజయానికి 'ఉమ్మడి బాధ్యత' తీసుకుంది. అయితే ఈ సారి దేశవ్యాప్తంగా నాయకత్వంపై అక్కడక్కడ వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి.