ఆయన నాలా ఎప్పుడైనా ముందుకువచ్చారా?

 ఆయన నాలా ఎప్పుడైనా ముందుకువచ్చారా?

తమిళనాడు పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నైలోని స్టెల్లామేరీ కళాశాల విద్యార్ధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాహుల్ ప్రత్యేకంగా కనిపించారు. ఎప్పుడూ తెల్లని కుర్తాలో ఉండే రాహుల్.. చెన్నై సభకి మాత్రం టీషర్ట్, జీన్స్ ప్యాంటు ధరించి వచ్చారు. ఈ సమావేశంలో మహిళా బిల్లు గురించి హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా బిల్లు ఆమోదిస్తామని అన్నారు. అంతే కాకుండా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాహుల్‌ని సర్ అని సంబోధించారు. అయితే తనను సర్ కాకుండా రాహల్ అని పిలువవచ్చని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు రాహుల్ గాంధీని క్లిష్ట ప్రశ్నలు వేశారు. అన్ని ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానం చెప్పారు. 3,000 మంది మహిళల మధ్య ఇలా నాలా నిలబడి మోడీ మాట్లాడుతుండగా మీరు ఎప్పుడైనా చూశారా? ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి ఆయన నాలా ఎప్పుడైనా ముందుకువచ్చారా? అని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక రంగానికి నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. రఫేల్‌ ఒప్పందాన్ని ప్రధాని మోడీ.. విమానాల తయారీలో ఎటువంటి అనుభవం లేని ఓ పారిశ్రామిక వేత్తకు అప్పగించాని ఆరోపించారు. దీనిపై మోడీ మౌనం వహిస్తున్నారు అని రాహుల్ గాంధీ విమర్శించారు.