రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయా?

రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయా?

గడచిన రెండుసార్లు రెపో రేటును ఆర్బీఐ తగ్గించినా.. జనానికి మాత్రం పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇవాళ మూడోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించినా.. ప్రజల్లో మాత్రం తమకు ఆ ప్రయోజనం దక్కుతుందా అన్న అనుమానం వ్యక్తమౌతోంది. నిరర్థక ఆస్తుల ఊబిలో ఇరుక్కున్న బ్యాంకులు... ఆర్బీఐ కల్పిస్తున్న ప్రయోజనాలను తమ ఖాతాదారులకు ఇవ్వడంలో విఫలమయ్యాయి. కొన్ని బ్యాంకులు నామ మాత్రపు వడ్డీ రేట్ల తగ్గింపుతో చేతులు దులుకుపుకున్నాయి. గతంలో మాదిరిగా ఆర్బీఐ ప్రకటించిన వెంటనే బ్యాంకులు స్పందించడం, వడ్డీ రేట్లను తగ్గించడం ఇటీవల తగ్గిపోయింది. రెపో రేటు పెరిగినపుడల్లా ఆలస్యం చేయకుండా వెంటనే ఖాతాదారులపై వేసిన బ్యాంకులు ఇపుడు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ముఖ్యంగా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఆర్బీఐ కేవలం విధాన ప్రకటనకే పరిమితమైపోయింది. గతంలోనూ వడ్డీ రేట్లను తగ్గించమని బ్యాంకులను ఆదేశించినా... కార్యాచరణలో పెద్దగా ఫలితం లేకపోయింది. ఉన్న ఆదాయాన్ని పోగొట్టుకోవడానికి ఏ బ్యాంకర్‌ కూడా సిద్ధంగా లేరు. రుణాలపై వడ్డీ రేట్ల తగ్గడం గగనంగా మారిన నేపథ్యంలో... డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడానికి బ్యాంకులు తొందరపడుతున్నాయి. తొలుత నిధుల సమీకరణ వ్యయం తగ్గాలని, అపుడే తాము తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వగలగుతామని బ్యాంకులు అంటున్నాయి. రెపో రేటు తగ్గినపుడల్లా బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంతో... సీనియర్ సిటిజన్లు లబోదిబోమంటున్నారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఆకర్షణీయ వడ్డీ ఇప్పుడు లభిస్తున్నా... తాజా ఆర్బీఐ ప్రకటన తరువాత వాటిపై కూడా వడ్డీని తగ్గిస్తారా అన్న అనుమానం కలుగుతోంది. వెరశి... పరపతి విధానం తరువాత బ్యాంకింగ్‌ రంగంలో కన్పించిన హడావుడి ఇప్పుడు పూర్తిగా  తెరమరుగైంది.  మనీ మార్కెట్‌, బాండ్ మార్కెట్‌తో పాటు కేవలం కరెన్సీ మార్కెట్లకు పరిమితమౌతోంది.