కాశ్మీర్ లో మళ్ళీ కర్ఫ్యూ ?

కాశ్మీర్ లో మళ్ళీ కర్ఫ్యూ ?

శ్రీనగర్, జమ్మూ ప్రాంతాల్లో వాతావరణం ప్రశాంతంగా ఉందని చెబుతూ కర్ఫ్యూ ఎత్తివేసిన కొద్ది సేపటికి కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయని ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే శ్రీనగర్‌లో మళ్లీ కర్ఫ్యూ విధించినట్లు సమాచారం. ఓ జాతీయ మీడియా కధనం ప్రకారం ప్రజలంతా ఇళ్లల్లోకి వెళ్లిపోవాలని రోడ్లపై సంచరిస్తున్న పోలీసు వాహనాలు, మైకుల్లో ప్రకటిస్తున్నారని పేర్కొంది. ప్రజలను తమ ఇళ్లలోకి వెళ్ళిపొమ్మని, దుకాణదారులు తమ దుకాణాలను మూసివేయమని వారు లౌడ్ స్పీకర్స్ లో హెచ్చరిస్తున్నట్టు చెబుతున్నారు.

హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు శ్రీనగర్ అలాగే బారాముల్లాలో "నిరసనలు" జరిగాయని కానీ వీటిలో ఏ నిరసనలో కూడా 20 మందికి పైగా జనాభా పాల్గొనలేదని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో సహా 400 మంది రాజకీయ నాయకులు గత వారం నుండి హౌస్ అరెస్టులో ఉన్నారు. అలాగే కాశ్మీర్ లోయలో కాల్పులు జరిగినట్లు వచ్చిన పుకార్లను నమ్మవద్దని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రజలను కోరినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. నిన్న శ్రీనగర్ మరియు ఇతర పట్టణాల్లో ఈద్ షాపింగ్ కోసం జనాలు బయటకు వెళ్ళారని సమాచారం. బహుసా ఈ పండుగ షాపింగ్ కోసమే ఈ కర్ఫ్యూని తాత్కాలికంగా సడలించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.