కర్ణాటక గవర్నర్ మీన మేషాలు లెక్కిస్తున్నారు

కర్ణాటక గవర్నర్ మీన మేషాలు లెక్కిస్తున్నారు

కర్ణాటక ఫలితాల నేపథ్యంలో గవర్నర్ పాత్రపై చర్చించాల్సిన అవసరం ఉంది అని అన్నారు తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. బుధవారం మీడియాతో రేవంత్  మాట్లాడుతూ... కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ లకు సంపూర్ణ మెజారిటీ ఉందన్నారు. గోవాలో అత్యధిక స్థానాలు గెలిచిన కాంగ్రెస్‌ను కాదని.. బీజేపీకి గవర్నర్ అవకాశం ఇచ్చారన్నారు. మణిపూర్, మేఘాలయలో  ఏర్పాటైన కూటములకు గవర్నర్లు అవకాశం ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. బీజేపీ పార్టీ కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అంటే.. పార్టీలను చీల్చడం, కొనుగోలుకు చేయడం వంటి వాటికి అవకాశం ఉంది అని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగంపై మోడీ, అమిత్ శాలకు గౌరవం ఉందా? అని ప్రశ్నించారు. నీచమైన పార్టీ ఫిరాయింపులకు బీజేపీ సిద్ధం అవుతుంది, కర్ణాటక గవర్నర్ మీన మేషాలు లెక్కిస్తున్నారన్నారు. కర్ణాటక గవర్నర్ వెంటనే జేడీఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు పిలవాలని టీపీసీసీ డిమాండ్ చేస్తుందని తెలిపాడు. ఎమ్మెల్యేల కొనుగోలుకు అవకాశం లేకుండా గవర్నర్ నిర్ణయం కర్ణాటకలో ఉండాలన్నారు. 

 గతంలో అవకాశం ఉన్నా వాజ్‌పేయి, అడ్వాణీ అక్రమ మార్గాల వైపే చూడలేదని అన్నారు. వాజపేయి-అడ్వాణీల బీజేపీ కాదు ఇది మోదీ-అమిత్ షాల బీజేపీ అని తెలిపారు. మోదీ, అమిత్ షా బీజేపీని చెరబట్టారంటూ రేవంత్‌ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతిచ్చిన కేసీఆర్.. ఆపార్టీ ఎటు వెళ్లాలో చెప్పాలని డిమాండ్ చేశారు. నైతిక విలువలు ఉన్న రాహుల్ గాంధీతో పోల్చుకోవడానికి మోదీ అమిత్ షాలు సరిపోరు అని ఎద్దేవా చేశారు. మోడీ-అమిత్ షాల నాయకత్వం భారత దేశానికి చేటు అని విమర్శించారు.