తెలంగాణలో విద్యుత్తు‌ వెలుగులకు కారణం సోనియా

తెలంగాణలో విద్యుత్తు‌ వెలుగులకు కారణం సోనియా

కేసీఆర్‌ సీఎం అయ్యాకే విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్టు మాట్లాడుతున్నారని.. గత ఉత్పత్తికి అదనంగా ఒక్క యూనిట్‌ కూడా ఉత్పత్తి చేయలేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలోని గంగాధరలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన పాల్గోన్నారు. తెలంగాణలో విద్యుత్తు‌ వెలుగులకు కారణం సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం తప్ప కేసీఆర్‌ పాలన కాదని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో చేపట్టిన విద్యుత్‌ ప్రాజెక్టులే ఉత్పత్తి ప్రారంభించాయని రేవంత్ స్పష్టంచేశారు. దేశంలో ఎక్కడా లేని ధరకు కేసీఆర్‌ విద్యుత్తు‌ కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం పదవి కోసం కేసీఆర్‌ కుటుంబ సభ్యులే పోటీపడుతున్నారని ఎద్దేవా చేశారు. 103, 106 సీట్లు గెలిచేటట్లు అయితే రోజుకు ఎనిమిది సభలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ అభ్యర్థులు కమీషన్లు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. కేసీఆర్‌ తన బంధువులకు ఒక న్యాయం, దళితులకు మరో న్యాయం. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైంది. మిషన్‌ భగీరథ కాస్త కమీషన్‌ భగీరథగా మార్చారు. ఎన్నికలకు ముందు, ఉద్యమ సమయంలో కేసీఆర్‌ చెప్పిందొకటి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసింది మరొకటి. ఆయన ఉద్యమకాలంలో చెప్పిన పనులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉంటే ఈ రోజు అవే చెప్పుకొనేవాళ్లని రేవంత్ రెడ్డి అన్నారు.