మల్కాజ్‌గిరి మినీ భారత్‌.. ప్రజలను నమ్మి బరిలోకి..

మల్కాజ్‌గిరి మినీ భారత్‌.. ప్రజలను నమ్మి బరిలోకి..

మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం మినీ భారత దేశం... తాను ప్రజలను నమ్మి ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నానని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి... మల్కాజ్‌గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఖరారు కావడంతో.. ఆ సీటును ఆశించిన మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలంగౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన... అనంతరం మాట్లాడుతూ.. కార్యకర్తలకు నాయకులు అండగా ఉండాల్సిన సమయం ఇది అన్నారు. కేసీఆర్ సీఎం అయిన వెంటనే నియంతగా మారాడని.. నియంతృత్వ పాలన ఎలాఉంటుందో చూపించారని, 98 స్థానాలు టీఆర్ఎస్ కు ప్రజలు ఇచ్చినా ఆయన మారడం లేదని, సొంత పార్టీ ఎమ్మెల్యేలను గొడ్డులాగా చూస్తూ ఓవైపు పక్క పార్టీ వాళ్లను చేర్చుకుంటున్నారంటూ మండిడపడ్డారు.

రెండోసారి సీఎం అయ్యాక కేసీఆర్ రక్షసత్వాన్ని చూపిస్తున్నారని విమర్శించారు రేవంత్.. ఇప్పటి ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయన్న ఆయన... నేను ఇంట్లో ఉంటే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వచ్చి నన్ను పోటీ చేయమని అడిగారు, నేను సబితమ్మ ఇంటికి వెళ్లి అడిగిన నన్ను పోటీ చేయమని అడుగుతున్నారు, మిరే బాధ్యత తీసుకోవాలంటే.. రేవంత్ పోటీ చేయి.. నేను చూసుకుంటా అని సబితక్క అన్నారు. కానీ, ఇప్పుడు నా బంధువులు అందరూ కేసీఆర్ పక్కన చేరారని, బంధువులు అందరూ ఒక పక్కన ఉంటే నేను పోటీ చేయడం అవసరమా అనుకున్నా.. కానీ, కేసీఆర్ లాంటి రాక్షసుని ఎదుర్కోవడానికి తప్పదు అనిపించిందన్నారు రేవంత్. ఎన్నికల్లో విచక్షణతో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని సూచించిన ఆయన.. మీ ప్రాంతం నుంచి ఎలాంటి వ్యక్తి ఉండాలో ప్రజలు ఆలోచించాలి, చట్ట సభల్లో మీ సస్యలు లెవనెత్తె వాళ్లకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 2014లో కూడా 15 మంది ఎంపీలు ఉంటే కేసీఆర్ ఏం సాధించారని ప్రశ్నించారు రేవంత్... కనీసం కంటోన్మెంట్‌లో రోడ్డు కూడా సాధించలేదని ఆరోపించిన ఆయన.. ఇప్పుడు 16 మందిని గెలిపిస్తే ఏంచేస్తారు? అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీకి ఓటు వేస్తే మోడీ, కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాహుల్.. మరి టీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎవరు ప్రధాని? అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి.. ఇది జాతీయ పార్టీల ఎన్నికలు, టీఆర్ఎస్ ఆటలో అరటి పండు మాత్రమే, ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ అని.. 25 రోజులు నిరంతరంగా కాంగ్రెస్ కోసం పనిచేయాలని.. కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని ధైర్యాన్ని చెప్పారు రేవంత్.