ఓడిపోతారనే భయంతోనే ముందస్తు: రేవంత్

ఓడిపోతారనే భయంతోనే ముందస్తు: రేవంత్

ఓడిపోతారనే భయంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రేవంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా హాల్ లోని ప్రెస్ మీట్ లోపాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ... కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు కానీ ఎదురుదాడికి దిగుతున్నాడు కేసీఆర్ అని ఆరోపించారు. ముందస్తుతో ఎవరికి ప్రయోజనం.. ఎవరి ప్రయోజనాలు ఆశించి ముందస్తుకు పోతున్నారని ప్రశ్నించారు. మీ బాస్ లు ప్రజలు అయినప్పుడు ఐదేండ్లు అధికారంలో ఉండండి అని చెప్పారు.. మరి ముందస్తుకి ఎందుకు పోతున్నారని ఆయన అడిగారు. ఎన్నికలు అంటే కాంగ్రెస్ కి భయం అని ఎందుకు అనుకుంటున్నవ్.. అది నీ అవగాహనా రాహిత్యం అని రేవంత్ అన్నారు. ముందస్తు ఎన్నికలకు పోతే ఎన్టీఆర్, చంద్రబాబుకి పట్టిన పరిస్థితే వస్తుంది సీఎం కేసీఆర్ కి అని రేవంత్ రెడ్డి అన్నారు. ముందస్తుతో ఇప్పడు పార్లమెంట్ ఎన్నికల కోసం మొత్తం 8 నెలలు కోడ్ ఉంటుంది.. దీంతో తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. 

వచ్చే ఏడాదిలో జరగాల్సిన ఎన్నికల కార్యాచరణను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ముందస్తు ఎన్నికల కోసం వెళ్ళాలి అంటే.. ఓటరు నమోదు ప్రక్రియ ఆగిపోతుంది అని రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ని పక్కన పెట్టి ఎన్నికలు నిర్వహించండి అని ప్రధాని మోడీ దగ్గర మొకరిల్లారు కేసీఆర్ అని అన్నారు. ఇన్నాళ్లు విభజన హామీల మీద కేంద్ర మంత్రులను, ప్రధానిని అడిగిన దాఖలాలు లేవు.. ఇప్పుడు మాత్రం కేంద్రం దగ్గర మొకరిల్లుతున్నారని విమర్శించారు. గడువుకే ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేలుగా గెలవడం కూడా ఇబ్బంది అని.. ఇప్పుడే ఎన్నికలకు పోతా అని మోడీని బతిమాలుతున్నారన్నారు. ఓడిపోతారనే భయంతోనే తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ తో కలిసి ఉన్న తెలంగాణ ఎన్నికలు ఎందుకు ముందుకు రప్పించాలి అనుకుంటున్నారో సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఒక్కసారి నెగ్గితేనే ఇంత అహంభావం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.