కోదండరాంతో రేవంత్‌ భేటీ

కోదండరాంతో రేవంత్‌ భేటీ

సోమవారం ఉదయం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. కోదండరాం ఇంటికి వెళ్లి మల్కాజిగిరి పార్లమెంట్‌ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. దాదాపు గంట సేపు ఇద్దరు చర్చించారు. అయితే కోదండరాం సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

భేటీ అనంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ... మల్కాజిగిరి పార్లమెంట్‌ ఓ మినీ భారత దేశం. మల్కాజిగిరి సమస్యలపై పోరాడుతా అని హామీ ఇచ్చారు. తెలంగాణ ఇవ్వడమే కాదు, తెలంగాణకు చాలా హామీలను ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. మల్కాజిగిరిలో గెలవడానికి కోదండరాం గారి సహకారం చాలా అవసరమన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడుతా అంటున్నారు.. ఇంకెప్పుడు పెడుతారు, ఎన్నికలు అయిపోయాక పార్టీ పెడతారా? అని విమర్శించారు. కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతా అంటున్నాడు.. గత ఐదు సంవత్సరాలు కూడా 16 మంది ఎంపీలు ఉన్నారు.. ఏం సాధించారని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.

'మల్కాజిగిరిలో మద్దతు ఇవ్వమని రేవంత్ రెడ్డి అడిగారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులు ఉండాలి. అందుకే పార్టీలో చర్చించి మా నిర్ణయం చెప్తాం' అని కోదండరాం తెలిపారు.